వరదాపురం వర్సెస్ పరిటాల శ్రీరాం.. రగులుతున్న టికెట్ మంటలు

Sun Jan 16 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Varadapuram Suri vs paritala sriram In Dharmavaram

అనంతపురం రాజకీయాలు అంటేనే హాట్ హాట్. ఎప్పుడూ.. ఏదో ఒక విషయం ఇక్కడ రాజకీయంగా రగులుతూనే ఉంటుంది. నేతల మధ్య వివాదాలు విభేదాలు.. ఎప్పడూ.. తారస్థాయిలో రగులుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి రగడే రోడ్డెక్కింది. వచ్చే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందనగా.. ఇప్పటి నుంచే కీలకమైన ధర్మవరం టికెట్ పై.. ఇద్దరు కీలక నాయకులు.. నువ్వా-నేనా అనేరేంజ్లో రాజకీయం చేసుకుంటున్నారు.



విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న వరదాపురం సూరి(సూర్యనారాయణ) ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయనపై గతంలో ఉన్న కేసులు ఆర్థిక సమస్యల నేపథ్యంలో టీడీపీకి బై చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. ఇది అప్పట్లో జిల్లాలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేసి గెలిచిన సూరి.. పార్టీ నుంచి అధికారం చేజారగానే.. వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో టీడీపీ ఈ స్థానాన్ని పరిటాల కుటుంబానికి అప్పగించింది. వాస్తవానికి పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరాం.. ఎప్పటి నుంచో ధర్మవరం పై కన్నేశారు. అయితే.. సూరి ఉన్నాడనే కారణంగా.. చంద్రబాబు వెనుకడుగు వేశారు. అయితే.. సూరి.. పొరుగు పార్టీలో చేరిపోవడంతో వెంటనే పరిటాల కుటుంబానికి ఈ నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు అప్పగించారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరాం.. ఈ నియోజక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సునీత.. కానీ ఆయన కానీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇదే విషయం ఇటీవల శ్రీరాం కూడా వ్యాఖ్యానించారు. చేస్తే..తను లేకపోతే..తాను సూచించిన వారికే ఇక్కడ చంద్రబాబు టికెట్ ఇస్తారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పుడువరదాపురం సూరి వ్యవహారం యూటర్న్తీసుకుంది. వరదాపురం సూరి మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ నుంచి బయటకు వచ్చి.. మళ్లీ సైకిల్ ఎక్కేసి.. తన టికెట్ను తను తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే శ్రీరాం ఫైరవుతున్నారు.

రాప్తాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు పరిటాల సునీత ధర్మవరం నుంచి తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ధర్మవరంలో టీడీపీ ఉనికిని నిలిపింది తన భర్త పరిటాల రవీంద్ర అని ఆమె చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి సూరిని పక్కన పెట్టించి తమ ఇంటి నుంచి ఒకరు పోటీలో నిలిచేందుకు సునీత అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.

కట్ చేస్తే.. సునీత కోరుకున్నట్టుగా ధర్మవరం పగ్గాలు వచ్చాయి కానీ అప్పటికే రాప్తాడు చేజారింది. రాప్తాడులో తిరిగి కోలుకోవడానికే శక్తియుక్తులు చాలని పరిస్థితుల్లో ధర్మవరం పై పరిటాల ఫ్యామిలీ పూర్తిగా దృష్టి పెట్టలేకపోయింది. అయితే వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి వస్తాడనే ప్రచారం నేపథ్యంలో మాత్రం మళ్లీ పరిటాల కుటుంబం ధర్మవరం నియోజకవర్గం పరిధిలో తిరుగుతోంది. వరదాపురం సూరి అంటే గతం నుంచి పరిటాల కుటుంబానికి పడదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అతని టికెట్ ఇచ్చే అవకాశం లేకుండా చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే.. సూరిపై ఎలాంటి వ్యతిరేకత లేని.. చంద్రబాబు.. ఆయన తిరిగి వస్తే.. చేర్చుకుంటారని వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో పరిటాల శ్రీరాం.. ఇక్కడే పాగా వేశారు. సూరి టార్గెట్ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుఎవరికి ఈ టికెట్ ఇస్తారో చూడాలి.