Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ రెఢీ.. రిజిస్టర్ చేసుకున్న వారికే మొదట ఇస్తారా?

By:  Tupaki Desk   |   29 Oct 2020 5:00 AM GMT
వ్యాక్సిన్ రెఢీ.. రిజిస్టర్ చేసుకున్న వారికే మొదట ఇస్తారా?
X
ప్రపంచాన్నివణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా ప్రయోగాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో కొన్ని కంపెనీలపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆ రేసులో ముందున్న కంపెనీల్లో ఒకటి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ.. బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 1600 మందిపై ప్రయోగిస్తున్న ఈ వ్యాక్సిన్ ను భారత్ లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ద్వారా పంపిణీ చేయనున్నారు.

వ్యాక్సిన్ కు సంబంధించి సీరమ్ సంస్థ తాజాగా ఒక గుడ్ న్యూస్ ప్రజలకు చెప్పింది. డిసెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసర అవసరాలు ఉన్న వారికి.. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ డిసెంబరులో పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థకు చెందిన ఆదార్ పూనవల్లా పేర్కొన్నారు. అయితే.. వ్యాక్సిన్ అనుమతి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే బ్రిటన్ లో డిసెంబరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వీలుందని సీరమ్ సంస్థ చెబుతోంది. రెండు డోసులు ఉండే ఈ వ్యాక్సిన్ మొదటి డోసు వేసిన.. తర్వాత రెండో డోసును వేయనున్నారు. ఎన్ని రోజుల వ్యవధిలో రెండో డోసు వేస్తారన్న విషయంపై స్పష్టత రావటం లేదు. అంతేకాదు.. దీని ధర ఎంత ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఇప్పుడున్న వ్యాక్సిన్ కంటే తక్కువ ధరకే లబిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ సీరమ్ చెప్పినట్లే.. బ్రిటన్ లో డిసెంబరు నాటికే వ్యాక్సిన్ పంపిణీ షురూ అయితే.. కరోనా పడగ నీడ నుంచి ప్రపంచం తప్పించుకున్నట్లే అవుతుంది. అదే జరిగితే.. సెకండ్ వేవ్ ముప్పు నుంచి భారత్ సేవ్ కావటం ఖాయం. మరి.. అలా జరుగుతుందో లేదో కాలమే డిసైడ్ చేయాలి.