రాంగోపాల్ వర్మకు ఆహ్వానంపై ఆ వర్సిటీ వీసీ వింత వివరణ!

Fri Mar 17 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

VC Clarity in RamGopal Varma Invitation

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ప్రతిపక్ష టీడీపీతోపాటు నెటిజన్లు సైతం ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్ రాంగోపాల్ వర్మకు ఆహ్వానం పలకడంపై తనదైన శైలిలో వింత భాష్యం ఇచ్చారు.విద్యార్థుల్లో సృజనాత్మకను మేలుకొల్పడానికి వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికితీయడానికి రాంగోపాల్ వర్మను తాము ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను మేలుకొలపడానికి రాంగోపాల్ వర్మను మించినవారు మీకు (వీసీకి) కనిపించలేదా అని నిలదీస్తున్నారు. విద్యార్థులకు స్ఫూర్తిని ఇవ్వడానికి వర్మను మించినవారు మీకు ఎవరూ కనిపించలేదా అని ఎద్దేవా చేస్తున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉందని.. ఎంతోమంది ఈ యూనివర్సిటీ నుంచి వచ్చి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీకి బీ గ్రేడ్ అడల్ట్ మూవీస్ తీసుకునేవాడిని ముఖ్య అతిధిగా పిలవడం ఏమిటని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఇది రాబోతున్న పెను విపత్తు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

కాగా రాంగోపాల్ వర్మ టీడీపీ జనసేనలపై వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి వచ్చాడు. అక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి . ఈ ప్రపంచమంతా అంతమై పోయి మగాళ్లంతా చచ్చిపోవాలని.. తానొక్కడిని బతకాలని వర్మ కోరుకున్నాడు. అప్పుడు ఈ ప్రపంచంలో తానొక్కడినే అందగాడినవుతానంటూ వ్యాఖ్యానించాడు.

యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మరణానంతరం స్వర్గానికి వెళితే రంభ ఊర్వశి లేరని గుర్తిస్తే నిరాశ చెందుతారని అన్నారు. కాబట్టి జంతువుల్లాగా ఈ భూమిపై మీ జీవితాన్ని మీరు 'ఎంజాయ్' చేయడం మంచిదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ తన ఇష్టం వచ్చినట్లు జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉపాధ్యాయులు ఏమి బోధించారో పట్టించుకోకుండా తాగాలి తినాలి నిషేధించని లైంగిక సంబంధాలు కలిగి ఉండాలని విద్యార్థులకు వర్మ హితబోధ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు కూడా రాంగోపాల్ వర్మ మాటలకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.  

కాగా ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా 'వ్యూహం' 'శపథం' అనే సినిమాలను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సినిమాలు విడుదలవుతాయని టాక్. కాగా గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తదితర సినిమాల ద్వారా టీడీపీని దెబ్బకొట్టాడు.. రాంగోపాల్ వర్మ.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.