ఆయనకు చంద్రబాబు పై అపరిమిత ప్రేమ!

Thu Apr 18 2019 20:00:01 GMT+0530 (IST)

V Hanumantha Rao Supports Chandrababu naidu

ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబుపై తనకెంత ప్రేమ ఉందో చాటుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. చంద్రబాబును అడుగడుగునా సమర్థిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు తనను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి కూడా రెడీ అని వీహెచ్ చెప్పుకొచ్చారు. ఒకవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నా.. వీ హనుమంతరావు మాత్రం తను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు.మరి ఎందుకో ఈయనను చంద్రబాబు నాయుడు ప్రచారానికి పిలవలేదు! ఇక పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా చంద్రబాబు మీద అపరిమిత ప్రేమను చాటుతూ ఉన్నారు వీహెచ్.

చంద్రబాబు నాయుడు ఏ అంశాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో.. వీహెచ్ కూడా అవే అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీలో పోలింగ్ కు ముందు సీఎస్ ను బదిలీ చేయడం అన్యాయమని వీహెచ్ వాపోతూ ఉన్నారు. ఆ అంశం గురించి బాబు వెర్షన్ అందరికీ తెలిసిందే. అచ్చం అవే మాటలే మాట్లాడుతూ ఉన్నారు వీహెచ్.

ఇక ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు ఏయే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో… వీహెచ్ కూడా అవే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఐటీ - ఈడీ దాడులను కూడా చంద్రబాబు నాయుడు ఎంతగా తప్పు పడుతున్నారో అందరికీ తెలిసిందే. ఆ విషయంలో కూడా బాబు తరఫునే మాట్లాడుతూ ఉన్నారు వీహెచ్. మోడీ వ్యతిరేకుల మీదే ఐటీ ఈడీ దాడులు జరుగుతున్నాయని ఈయన అన్నారు.

ఇలా చంద్రబాబు నాయుడు ఏం చెబితే అవన్నీ రైటే అని - ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తూ వీహెచ్ మాట్లాడుతూ ఉన్నారు. బాబుకు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్నారు! మొత్తానికి చంద్రబాబుకు గట్టి సపోర్టరే దొరికారు!