Begin typing your search above and press return to search.

డీజీల్.. పెట్రోల్ వాడకం ఎంత ఎక్కువైందంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2023 4:00 PM GMT
డీజీల్.. పెట్రోల్ వాడకం ఎంత ఎక్కువైందంటే?
X
కొవిడ్ కొట్టిన దెబ్బ నుంచి ప్రపంచం ఇప్పటికి కోలుకున్నది లేదు. కొవిడ్ ఎఫెక్టుతో కిందా మీదా పడుతున్న వేళలో.. ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధం.. దీనికి తోడు మాంద్యం పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నాయి. దీనికి తోడు ఖర్చును అదుపులోకి ఉంచుకోవటంకోసం దిగ్గజ సంస్థలు సైతం భారీగా ఉద్యోగాల్ని తీసేస్తున్న వేళ.. మన దేశంలోని పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరే గణాంకాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

దేశంలో పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు జోరందుకోవటమే కాదు.. మే నెలలో నమోదైన గణాంకాలు ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వ్యవసాయానికి డిమాండ్ పెరగటం.. వేసవి ప్రారంభంతో ఏసీల వినియోగం భారీగా ఉండటంతో పాటు.. ఉత్పాదక రంగం.. ఇతర రంగాలు మాంచి ఊపు మీద ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం డీజిల్ కాగా.. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో దీని వినియోగం 9.3 శాతం పెరగటం దీనికి సాక్ష్యంగా చెప్పాలి.

మొత్తం దేశంలోని ఇంధన డిమాండ్ లో డీజిల్ వాటా ఐదింట రెండు వంతులుగా చెబుతారు. నెలవారీగా డీజిల్ డిమాండ్ ఏప్రిల్ లో 7.16 మిలియన్ టన్నులు అయితే.. మేలో 4.2 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు పెరిగింది. పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పెరగ్గా.. నెలవారీ డిమాండ్ ఏకంగా 16.5 శాతం పెరగటం గమనార్హం.

కొవిడ్ సంక్షోభంలో ఉన్న 2021 మేతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 72 శాతం పెరగ్గా.. కొవిడ్ ముందు ఏడాది అంటే 2019 మే తో పోల్చినా 23.7 శాతం పెరిగినట్లుగా తేలింది. 2021 మేతో పోలిస్తే డీజిల్ వినియోగం ఇప్పుడు 52.5శాతం.. 2019 మే తో పోలిస్తే మాత్రం 6.8 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు.

పెట్రోల్.. డీజిల్ మాత్రమే కాదు విమానయాన రంగంలో వినియోగించే జెట్ ఫ్యూయల్ కు సైతం డిమాండ్ భారీగా పెరిగిందని చెబుతున్నారు. జెట్ ఫ్యూయల్ డిమాండ్ 2002 మేతో పోలిస్తే 8.7 శాతం పెరిగింది. అదే సమయంలో 2021 మేతో పోలిస్తే ఈ డిమాండ్ 137 శాతం కాగా.. కొవిడ్ ముందు అంటే 2019 మేతో పోలిస్తే మాత్రం 5.3 శాతం తక్కువగానే ఉందని చెబుతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే ఈ ఏడాది ఏప్రిల్ లో జెట్ ఫ్యూయల్ వినియోగంభారీగా నమోదైంది. మేతో పోలిస్తే.. ఏప్రిల్ లో వినియోగం 0.7 శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఏమైనా.. పెట్రోల్.. డీజిల్.. జెట్ ఫ్యూయల్ ఇంధనాల వినియోగం చూస్తే.. దేశం వేగంగా ముందుకు వెళుతుందన్న విషయం అర్థమవుతుంది.