Begin typing your search above and press return to search.

పాక్ ఆర్మీ చీఫ్ 'మేకపోతు గాంభీర్యం'..!

By:  Tupaki Desk   |   4 Dec 2022 9:32 AM GMT
పాక్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం..!
X
పాకిస్తాన్ సైనిక దళాల నూతన ప్రధానాధికారిగా లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల నియామకమయ్యారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బద్ధ శత్రువుగా మారిన ఆసిమ్ మునీర్ నే ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏరికోరి ఆ పదవీలో కూర్చోబెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పదవీ నుంచి దిగిపోవడానికి పాక్ ఆర్మీ కుట్రలు చేసిందని ఆయన పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే.

ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆసిమ్ మునీర్ ఐఎస్ఐ Inter-Services Intelligence చీఫ్ గా ఉన్నారు. ఆయనది ఎవరినీ లెక్కచేయని మనస్తత్వమని.. ఈ కారణంగానే ఇమ్రాన్ ఖాన్ తో విబేధాలు నెలకొన్నట్లు పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2019లో జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఆసిమ్ మునీర్ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు.

పుల్వామా సంఘటన 40 మంది భారతీయులు అమరులయ్యారు. ఈ పరిణామం తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత వాయుసేన పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టింది. ఈ పరిణామం పాక్ కు మింగుడు పడకుండా చేయగా భారత్ లో మాత్రం పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.

ఇక అనంతరం పాక్ జరిగిన పరిణామాల నేపథ్యంలో మరోసారి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పాక్ ఆర్మీ కుట్రలు సైతం ఇమ్రాన్ ఖాన్ పదవీ నుంచి దిగిపోవడానికి కారణమయ్యాయని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. ఇటీవల పాక్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా పాక్ అవినీతి ఆరోపణలతో తన పదవీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.

ఈక్రమంలోనే ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ గా నియామకమయ్యారు. కాగా ఇటీవల భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ భారత ప్రభుత్వం పీవోకేను స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తాజా ఆసిమ్ మునీర్ స్పందించారు. పీవోకే లో ఒక్క ఇంచు భూమి కూడా వదులుకోమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

పాక్ ఆర్మీ చీఫ్ గా నియామకమైన వెంటనే ఆసిమ్ మునీర్ పీవోకేలో పర్యటించారు. ఎల్ వోసీ దగ్గర పరిస్థితులను పర్యవేక్షించారు. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. మేథా సంపత్తి.. ఆయుధ సంపత్తిలో భారత్ కు పాక్ ఆర్మీ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత్ తో కయ్యానికి కాలు దివ్వుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.