పెద్దన్న ఆశీస్సులుంటేనే పెద్దల సభకు

Tue Jan 24 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Update on YSRCP MLC Posts

వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల సందడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు.2023 మార్చి నెలాఖరు నుంచి జులై మధ్యలో మొత్తం 23 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతం 6 సీట్లు మాత్రమే వైసీపీ స్థానాలు. 12 స్థానాలు టీడీపీ చేతిలో ఉన్నాయి. బీజేపీ చేతిలో 3 పీడీఎఫ్ చేతిలో 2 సీట్లు ఉండగా .. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే.. టీడీపీ నుంచి 12 సీట్లు ఖాళీ అవుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో మెజారిటీ స్థానాలు వైసీపీకి దక్కుతాయి. బీజేపీ అయితే ఖాళీ అవుతున్న 3 స్థానాలలో ఒక్కటి కూడా గెలుచుకోవడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీ అవుతున్న 23 స్థానాలలో 17 నుంచి 19 స్థానాలు వైసీసీకి దక్కే సూచనలున్నాయి. దీంతో వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఏ కోటాలో ఎన్ని ఖాళీ అవుతున్నాయంటే..

1) ఎమ్మెల్యే కోటా:
ఈ కోటాలో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29న ఖాళీ అవుతున్నాయి. ఇందులో 5 వైసీసీ 2 టీడీపీ సిటింగ్ సీట్లు

2) స్థానిక సంస్థల కోటా:
స్థానిక సంస్థల కోటాలో మార్చి 29న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతోంది. ఆ తరువాత మే 1న మరో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. మే 1నే బీజేపీ ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తవుతుంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉండడంతో ఈ 9 స్థానాలూ ఆ పార్టీకే దక్కడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

3) పట్టభద్రుల కోటా:
మార్చి 29న ఒక పీడీఎఫ్ ఒక వైసీపీ ఒక బీజేపీ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తికానుంది.

ఇది పట్టభద్రుల కోటా కావడంతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది.

4) ఉపాధ్యాయ కోటా:
మార్చి 29న ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. ఇందులో ఒకరు పీడీఎఫ్ కాగా ఇంకొకరు ఇండిపెండెంట్.

ఇవి కూడా ఉపాధ్యాయ సంఘాల బలాబలాల బట్టే ఉండనుంది. వైసీపీకి అవకాశం చాలా స్వల్పం.

5) నామినేటెడ్ కోటా:
జులై 20న ఇద్దరు టీడీపీ నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. ఇది పూర్తిగా వైసీపీ చేతిలో ఉంటుంది. తమ పార్టీకే చెందినవారికి ఇస్తారో.. లేదంటే ఇతర రంగాల నుంచి ఎవరికైనా అవకాశం కల్పిస్తారో చూడాలి. ఇతర రంగాల నుంచి అవకాశాలు కల్పించినా పార్టీకి అనుకూలురైనవారికే అవకాశం ఉండనుంది.

ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తమ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవుతున్న 9కి 9 సీట్లూ వైసీపీకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా 7 సీట్లు ఖాళీ అవుతుండడంతో అందులో 6 వైసీపీకే వస్తాయని నమ్మకంగా ఉన్నారు. ఇక నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ కోసం కొందరు జర్నలిస్టులు సినీ రంగానికి చెందిన కొందరు జగన్ వద్ద అప్పుడే పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎందరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. జగనన్న ఆశీస్సులు దక్కి ఎవరు పెద్దల సభకు వెళ్తారో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.