మిర్చి బజ్జీ మీద కాదు.. పెరుగన్నం మీద ఫోకస్ పెంచాలి రేవంత్

Wed May 25 2022 10:24:20 GMT+0530 (IST)

Update About RevanthReddy

వేళ కాని వేళలో బాండీలో మరిగే నూనె. మిర్చి బజ్జీ వేస్తున్న బండోడు కనిపించి.. ఆ వాసన గుభాళింపు ముక్కుకు చేరినంతనే.. మెదడు యాక్టివ్ కావటమే కాదు.. మనసులోకి ఆ బజ్జీ రుచి చూడాలనుకోవటం.. నాలుక సైతం ఆ అనుభవం కోసం తపించటం చేస్తుంది. అంతటి పవర్ మిర్చి బజ్జీ. కానీ.. అంతలా లాగేసే దాన్ని ఒకటికి రెండు ఎక్కువ తిన్నాక.. కడుపులో జరిగే యుద్ధం.. ఆ తర్వాత మనసుకు కలిగే చికాకు.. మొత్తంగా రోజు మొత్తాన్ని బ్యాడ్ గా మార్చేయటమే కాదు.. ఏదో ఒక మందుబిళ్ల వేసుకునే వరకు కడుపు ఒక కొలిక్కి రాదు.కట్ చేసి.. పెరుగున్నం చూసినంతనే తినాలనిపించదు. ఆ మాటకు వస్తే.. ఎప్పుడు పడితే అప్పుడు పెరుగున్నం తినే కన్నా.. ఎవాయిడ్ చేసేటోళ్లు ఎక్కువగా కనిపిస్తారు. సరైన పెరుగన్నం ఏ టైంలో తిన్నా.. తినేటప్పుడు దాన్ని అస్వాదించలేకున్నా.. అది కడుపులోకి చేరాక మాత్రం బుద్దిగా ఉంటుందే తప్పించి.. అనవసరమైన అల్లరి చేయదు. పొద్దు పొద్దున్నే ఈ మిర్చి బజ్జీ.. పెరుగన్నం కాన్సెప్టు ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. దూకుడు రాజకీయాలు మొదలైన తర్వాత ప్రత్యర్థుల మధ్య మర్యాదలు తగ్గటం.. ఎవరెంత ఎక్కువగా తిట్టుకుంటే అంతలా మైలేజీ రావటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది.

అందుకే.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వీలైనంత ఘాటుగా విమర్శించుకోవటం రాజకీయ నేతలకు ఒక అలవాటుగా మారిందని చెప్పాలి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ ఎంట్రీతో.. టీకాంగ్రెస్ లో నూతనోత్సాహం చోటు చేసుకుందని చెప్పక తప్పదు. అప్పటివరకు నిద్ర పోతున్నట్లుగా ఉన్న రాష్ట్ర పార్టీలో ఒక చైతన్యంతో పాటు.. అందరిలోనూ చురుకుదనం వచ్చేసింది. అందుకు నిదర్శనం ఇంకెక్కడో కాదు..మారిన గాంధీ భవన్ రూపురేఖలు చెప్పేస్తాయి.

మంచి మాటకారి అయిన రేవంత్ రెడ్డి.. సందర్భానికి తగ్గట్లు తిట్ట దండకాన్ని బయటకు తీస్తే బాగుంటుంది. అంతే తప్పించి.. అదే పనిగా టార్గెట్ చేయటంలోనూ అర్థం లేదు. వరంగల్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో.. పార్టీ అధినాయకత్వంతో తనపై నమ్మకాన్ని మరింత పెంచుకున్న రేవంత్.. అంతే బుద్ధి కుశలతను మిగిలిన విషయాల్లోనూ ప్రదర్శించాలని చెబుతున్నారు. తమ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ వెలిగిపోతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ అండ్ కోకు.. వాస్తవాల్ని గ్రౌండ్ లెవల్ లో పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి పనులు చేసినంతనే ఆశించినంత మైలేజీ రాకపోవచ్చు. కాకుంటే.. బండ బూతులు.. ఘాటు విమర్శలు.. సంచలన ఆరోపణలతో వచ్చే లాభం బాగానే ఉన్నా.. అవన్నీ మిర్చి బజ్జీల మాదిరి వ్యవహరిస్తాయి. కానీ.. ప్రజా క్షేత్రంలోకి దిగి.. ప్రజల సమస్యలు.. వారు పడుతున్న వెతల్ని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది.

అలా చేస్తున్నప్పుడు తెలీకుండానే పెరుగన్నం చేసే మంచి రేవంత్ ఇమేజ్ ను బిల్డ్ చేస్తుందని చెప్పాలి. అలా అని.. ఘాటు విమర్శలు చేయొద్దని చెప్పట్లేదు. కానీ.. దానికి సమయం.. సందర్భం చూసుకొని దిగటం మంచిది. అంతకు మించి ప్రజల కోసం తపిస్తున్న వైనాన్ని అర్థమయ్యే సంకేతం ఇప్పుడు చాలా అవసరమన్న విషయాన్ని రేవంత్ గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.