Begin typing your search above and press return to search.

ఐక్యతా.. సహనమే నేతాజీ మంత్రం - కుమార్తె

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:30 PM GMT
ఐక్యతా.. సహనమే నేతాజీ మంత్రం - కుమార్తె
X
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఐక్య‌తా.. స‌హ‌నం అనే సిద్ధాంతాల‌ను జీవితాంతం పాటించార‌ని, హిందూ మ‌తాన్ని ఆచ‌రించినప్ప‌టికీ.. అన్ని మ‌తాల‌నూ స‌మానంగా చూశార‌ని, అంద‌రినీ గౌర‌వించార‌ని ఆయన కుమార్తె అనిత బోస్ ఫాఫ్ అన్నారు. ఆమె జర్మనీలో ఉంటున్నారు. బోస్ 125వ జయంతి వేడుకల సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. ‘తన అనుచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండియన్ నేషనల్ ఆర్మీలోని సభ్యులకు బోస్ ఎంతో స్ఫూర్తినిచ్చారు. హిందూ మతాన్ని ఆచరించిన ఆయ‌న‌.. ఇతర మతాలను ఎంతో గౌరవించారు ’ అని ఆమె పేర్కొన్నారు.

జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న భారత కాన్సులేట్ ద్వారా సందేశం ఇచ్చిన అనిత... ఆ వీడియోను ఇండియన్ కాన్సులేట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఐక్యతా, సహనం’ అనే సిద్ధాంతాలనే ఆయన జీవితాంతం అనుసరించారని అనిత గుర్తు చేశారు. ఆలోచనకు, అమలుకు ఆయన ప్రతిరూపం అని కొనియాడారు. ‘ఎల్లప్పుడూ ఆధునిక, ఆనంద భారత్ కోసమే కలలు కన్నారు. ఇదే సమయంలో చరిత్రలో వేళ్లూనుకుపోయిన సంస్కృతి, జీవనతత్వం, మత సంప్రదాయాలను అనుసరించే ఇండియా కావాలనుకున్నారు’ అని చెప్పారు.

‘సుభాష్ చంద్ర‌బోస్‌ ఆలోచనలు, సిద్ధాంతాల నుంచి మనమందరం ప్రేరణ పొందాల‌ని, ఈ ప్రయత్నాలలో మీకు వందనం.. జై హింద్’ అని ముగించారు అనిత బోస్‌. బోస్ మనవడు, మాజీ ఎంపీ, నేతాజీ రిసెర్చ్ బ్యూరో ఛైర్మన్ సుగతా బోస్ మాట్లాడుతూ.. ఆయన జ‌యంతికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఇవ్వడం కంటే.. అన్ని కులాలు, వర్గాలను ఏకం చేసే నేతాజీ, గాంధీజీ ఆదర్శాలను అంద‌రూ అనుసరించడం చాలా ముఖ్యమ‌ని అన్నారు.

‘వ్యక్తిగతంగా.. పరాక్రామ్ దివస్ అనే పదాన్ని నేను ఇష్టపడను. దేశనాయక్ దివస్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు సుగ‌తా బోస్‌. నేతాజీ జయంతి వేళ శనివారం కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న బోస్ నివసించిన ఇంటిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తర్వాత సుగతా బోస్ ఈవ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.