Begin typing your search above and press return to search.

రెజ్ల‌ర్ల ఎఫెక్ట్‌: అంత‌ర్జాతీయ స్థాయిలో మోడీ ప‌రువు పాయే

By:  Tupaki Desk   |   31 May 2023 8:19 PM GMT
రెజ్ల‌ర్ల ఎఫెక్ట్‌: అంత‌ర్జాతీయ స్థాయిలో మోడీ ప‌రువు పాయే
X

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అంత‌ర్జాతీయ స్థాయిలో తాను వెలిగిపోతున్నాన‌ని.. విశ్వ‌గురువుగా వెలుగోందుతున్నా న‌ని.. ప్ర‌ధాని మోడీ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఆ వెలుగులు మ‌స‌క‌బారుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. రెజ్లర్ల ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పందించింది.

భార‌త కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. రెజ్లర్ల నిర్బంధాన్ని, వారితో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. రెజ్లర్ల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరింది.

45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరించింది. కొద్ది నెలలుగా రెజ్లర్ల చేస్తున్న ఆందోళనను తాము గమనిస్తున్నామని.. ఈ నిరసనల ప్రారంభ రోజుల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టిన విషయం తమ దృష్టిలో ఉందని వివరించింది. బ్రిజ్‌ భూషణ్‌ ప్రస్తుతం ఇంఛార్జ్‌ కాదని.. రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధరించేందుకు మరోసారి సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

మ‌రోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తాము ఉద్య‌మిస్తున్నా.. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యల విషయంలో కేంద్రం స్పందించకపోవడంపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల్లో స్పందించకపోతే తమ ప్రాణ సమానమైన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని హెచ్చరించారు. మంగళవారమే పతకాలను గంగలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమవ్వగా.. చివరి క్షణంలో ఖాప్‌, రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజుల గడువు ఇచ్చారు.