తెలుగు రాష్ట్రాల గవర్నర్ల కొత్త రికార్డు

Wed Sep 11 2019 11:10:14 GMT+0530 (IST)

Unique Record in Telugu States Governors

తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళిసై పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన ఈ ఫైర్ బ్రాండ్ ను తెలంగాణ గవర్నర్ గా ఎంపిక చేయటం ఆసక్తికరంగానేకాదు.. సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను ఏర్పాటుకు కాస్త ముందు ఏపీకి గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించటం తెలిసిందే.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలో మరే రెండు సోదర రాష్ట్రాలకు లేని ప్రత్యేకత తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు ఉందంటున్నారు. అదేమంటే.. దేశంలో అత్యధిక వయసున్న గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ రికార్డు క్రియేట్ చేస్తుంటే.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు అత్యంత పిన్న వయస్కురాలైన గవర్నర్ ఉండటం విశేషంగా చెప్పాలి. బిశ్వభూషన్  వయసు 85 ఏళ్లు అయితే.. తమిళిసై వయసు 58ఏళ్లు మాత్రమే. అంతేకాదు.. 60 ఏళ్ల లోపు ఉన్న ఏకైక గవర్నర్ తమిళిసై ఒక్కరేనట.

దేశంలో మరెక్కడా ఈ తరహా కాంబినేషన్ లేదని చెబుతున్నారు. తమిళిసై తర్వాత పిన్న వయస్కుడైన గవర్నర్ గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ను చెప్పాలి. ఆయన వయసు 60 ఏళ్లు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు 28 మంది గవర్నర్లు ఉననారు. అసోం.. మిజోరంలకు గవర్నర్ ఒక్కరే.

అరవై ఏళ్ల లోపు వారు ఒక్కరే అయితే.. అరవైలలో ఉన్నవారు ఏడుగురు. ఇక.. డెబ్బైలలో ఉన్న వారు ఏకంగా 14 మంది గవర్నర్లు ఉండటం విశేషం. 80లలో ఉన్న గవర్నర్లు ఆరుగురు ఉన్నారు. మొత్తం గవర్నర్లలో తొలిసారి బాధ్యతలు చేపట్టిన వారు 19 మందిగా కాగా.. గతంలో పని చేసిన వారు తొమ్మిది మంది ఉన్నారు. మొత్తం 28మంది గవర్నర్లలో ఆరు రాష్ట్రాలకు మహిళలు గవర్నర్లుగా ఉన్నారు.