Begin typing your search above and press return to search.

పరుగులు తీసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

By:  Tupaki Desk   |   31 May 2023 1:26 PM GMT
పరుగులు తీసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
X
దేశ రాజధాని ఢిల్లీ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ బ్రిజ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ల నిరసన గురించి మీడియా ప్రతినిధులు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ని ప్రశ్నలు వేయగా.. వాటికి సమాధానం చెప్పలేక ఆమె పరుగులు తీశారు. అయినప్పటికీ ఆమెనువదలని ఒక మీడియా ప్రతినిధి (మహిళ) ఆమెను అదే పనిగా ప్రశ్నిస్తూ.. మహిళా మంత్రి అయిన మీరు మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన మీద స్పందించరేమిటంటూ వేస్తున్న ప్రశ్నల కు సమాధానం చెప్పలేదు సరికదా పరుగు పరుగున ఆమె తమకారు ఉన్నంతవరకు పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దేశ ఖ్యాతి ని ఇనుమడింపచేసిన భారత స్టార్ రెజ్లర్లు గడిచిన కొన్ని వారాలుగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కు వ్యతిరేకంగా గళం విప్పి.. నిరసనలు నిర్వహించటం తెలిసిందే. వీరికి పలువురు క్రీడాకారులు తమ మద్దతు ను తెలిపారు. రాజకీయ పక్షాలు సైతం తమ సంఘీభావాన్ని తెలిపినప్పటికీ.. మీడియా లోనూ... కేంద్ర ప్రభుత్వం లోనూ పెద్దగా కదలికలు రాని పరిస్థితి.

ఒలింపిక్ క్రీడల్లో రెజ్లింగ్ పోటీల్లో పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్లు సైతం రోడ్ల మీద కు వచ్చి వారాల కు తరబడి చేస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకు కేంద్రం స్పందించింది లేదు. దీని పై ప్రధాని నరేంద్ర మోడీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీకి చెందిన పవర్ ఫుల్ ఎంపీని కాపాడుకునేందుకే వారు మౌనం వహిస్తున్నారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మహిళా రెజ్లర్ల నిరసనతో కదిలిన ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేసినప్పటికి ఇప్పటికి చర్యలు తీసుకున్నది లేదు.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు నిరసన ర్యాలీకి పిలుపును ఇవ్వటం.. వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా స్టార్ రెజ్లర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ర్యాలీ చేస్తున్న మహిళా రెజ్లర్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని స్టేషన్ కు తరలించే క్రమంలో పోలీసుల వాహనంలో వారు హ్యాపీగా సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా కొందరు మార్ఫింగ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు.

తాము చేస్తున్న నిరసన కు కేంద్రం స్పందించని నేపథ్యంలో తమకు వచ్చిన పతకాల్ని గంగానదిలో పడేస్తామన్న హెచ్చరికలు చేసిన వైనంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ పతకాల్ని గంగానదిలో పడేసేందుకు హరిద్వార్ వెళ్లిన వారిని రైతు సంఘాల నేతలు వారించటంతో వెనక్కి తగ్గారు. తమ డిమాండ్లను పరిష్కరించటానికి ప్రభుత్వానికి ఐదు రోజుల అల్టిమేటం ఇచ్చారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ స్పందిస్తూ.. గంగలో పతకాలు పడేస్తామని వెళ్లి రాకేశ్ టికాయత్ కు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. తనపై విచారణ జరుగుతుందన్న ఆయన మాట ను పలువురు తప్పు పడుతున్నారు.

ఇలాంటి వేళ.. ఈ ఇష్యూ మీద కేంద్రం లోని మోడీ సర్కారు స్పందిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళలోనే.. ఒక కార్యక్రమాని కి హాజరై వస్తున్న కేంద్రమంత్రి మీనాక్షి లేఖీని మీడియాప్రతినిధులు ప్రశ్నించటం.. అందుకు ఆమె సమాధానాలు చెప్పలేక పరుగులు తీసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియో ను పోస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 'సిగ్గులేని మంత్రి.. పారిపోయారు' అని తన ట్విటర్ హ్యాండిల్ లో విమర్శిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఆమె పరుగులు తీస్తున్న వీడియో ను పోస్టు చేశారు.