Begin typing your search above and press return to search.

వైసీపీ పాలన బాలేదు అంటున్న బీజేపీ పెద్దమనిషి!

By:  Tupaki Desk   |   30 May 2023 9:26 AM GMT
వైసీపీ పాలన బాలేదు అంటున్న బీజేపీ పెద్దమనిషి!
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జల్లో తీవ్ర వ్య‌తిర‌క‌త ఉంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్నేహితుడు, కేంద్ర మంత్రి భ‌గ‌వంత్ ఖుబా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ ఒక్కరూ వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో సంతోషంగా లేర‌ని అన్నారు.

అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్న‌ట్టు త‌న‌కు తెలిసింద‌ని అన్నారు. ఇక‌, ఏపీ రాజ‌ధానిగా అమరావతి కే బీజేపీ కట్టుబడి ఉందని ఖుబా అన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 300 పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ఖుబా అన్నారు. బీజేపీకి క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో ప్రజాదరణ తగ్గలేదని.. ఇతర పార్టీల‌ ఓటు కాంగ్రెస్ కి వెళ్లిందని ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓటమిపై ఖుబా విశ్లేషించారు.

ఏపీ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలనేదే తమ పార్టీ ఆలోచనగా ఖుబా స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల ఆలోచన ఆ పార్టీ వ్యవహారంగా తోసిపుచ్చారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి మాట్లాడడం ప్రజాస్వామ్యంలో సహజమని.. ఏపీ సీఎం విషయంలోనూ ఇదే జరుగుతోంది త‌ప్ప అంతకు మించి ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ లేదని ఖుబా వ్యాఖ్యానించారు.

మూడు రాజ‌ధానులు అనేది ప్ర‌పంచంలో ఎక్క‌డాలేద‌న్నారు. మ‌న దేశంలో అది సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. మూడు రాజ‌ధానులు ఎందుకు? స‌రైన పాల‌న చేస్తే.. ఒక్క‌రాజ‌ధాని చాల‌దా? అని ప్ర‌శ్నించారు.

నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఆర్థిక పరిస్థితులు అంత అధ్వాన్న స్థితికి చేరాయని పేర్కొన్నారు. ఖజానా లోటుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని... కొత్త పెట్టబడులు రావడం లేదని ఖుబా చెప్పారు.

ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు అవుతున్నందున బీజేపీలోని వివిధ విభాగాల ప్రతినిధులతో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఒకరోజు పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ఖుబా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిశిత విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.