Begin typing your search above and press return to search.

అమెరికాలోని నిరుద్యోగ భారత టెకీలకు ఊరట కలిగించేలా బైడెన్ సర్కార్ నిర్ణయం

By:  Tupaki Desk   |   24 March 2023 9:16 AM GMT
అమెరికాలోని నిరుద్యోగ భారత టెకీలకు ఊరట కలిగించేలా బైడెన్ సర్కార్ నిర్ణయం
X
మహా మాంద్యం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. వరుస పెట్టి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని వదిలించుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. దేశం కాని దేశానికి వచ్చి ఇట్టే ఇరుక్కుపోయిన టెకీలు ఎందరో ఇప్పుడు అమెరికాలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికాను వీడాల్సిన పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. చేస్తున్న ఉద్యోగం పోవటం.. కొత్త ఉద్యోగం రాని నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్న హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయాన్ని తాజాగా బైడెన్ ప్రభుత్వం తీసుకుంది.

ఈ నిర్ణయంతో మిగిలిన దేశాల వారి సంగతి ఎలా ఉన్నా.. భారత టెకీలు మాత్రం ప్రయోజనాన్ని పొందే వీలుందన్న మాట వినిపిస్తోంది. హెచ్ 1బీ వీసాదారులకు ఊరటనిచ్చేలా వారి వీసాలను బి1 (బిజినెస్).. బీ2 (పర్యాటక) వీసాదారులుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగ అవకాశాల కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. అమెరికాలో జాబ్ పోతే దేశాన్ని విడిచి వెళ్లటం తప్పించి మరో మార్గం లేదని భావించే వారి అభిప్రాయం తప్పని.. అలాంటి అపోహలకు గురి కాకుండా మరింత కాలం అమెరికాలో కొనసాగేందుకు పలు మార్గాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

60 రోజుల్లోపు వీసా స్టేటస్ ను మార్చుకొని బీ1, బీ2 గా మారితే గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్ని కొనసాగించొచ్చు అంటూ స్పష్టతను ఇచ్చారు. గడిచిన నవంబరు నుంచి ఇటీవల కాలం వరకు అమెరికాలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో లక్ష మంది వరకు భారతీయులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ఊరటను ఇచ్చేదిగా చెప్పక తప్పదు.