Begin typing your search above and press return to search.

జగన్ కి చెవులే పనిచేస్తాయి... పిచ్చి కుక్కగా జమ కట్టి ... ఉండవల్లి శ్రీదేవి హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   26 March 2023 1:19 PM GMT
జగన్ కి చెవులే పనిచేస్తాయి... పిచ్చి కుక్కగా జమ కట్టి ... ఉండవల్లి శ్రీదేవి హాట్ కామెంట్స్
X
ఉండవల్లి శ్రీదేవి. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే. ఆమె క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేశారని చెప్పిన్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. మూడు రోజుల తరువాత హైదరాబాద్ లో మీడియా మీటింగ్ పెట్టి మరీ జగన్ సర్కార్ ని ఏకి పారేశారు. ముఖ్యమంత్రి జగన్ కి చెవులు మాత్రమే ఉంటాయని, అవే పనిచేస్తాయని, కళ్ళతో చూడరని ఆమె అంటున్నారు. పక్క వారు చెప్పినదే జగన్ వింటారు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

జగన్ తన చుట్టూ ఉన్న వారి మాటలు విని తనను సస్పెండ్ చేశారని ఆమె వాపోయారు. తనను పిచ్చి కుక్కగా జమ కట్టి రోడ్డున పడేశారని, నాలుగేళ్ల పాటు విధేయతతో విలువలతో వైసీపీకి తాను చేసిన సేవలు పార్టీ గుర్తించకపోగా తనను తప్పించేయడం బాధాకరమని ఆమె అన్నారు.

అమరావతిలో దందాలు జరుగుతున్నాయని, ఇసుకను లారీలతో దోచుకుని పోతున్నారని, అక్కడ అన్ని రకాలైన అవినీతి కార్యకలాపాలు జరుగుతూంటే అడ్డుకున్నాననే తనను సైడ్ చేశారని అన్నారు దందాలు ద్వారా చేసిన డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడకు ఎవరికి వెళ్తోందని ఆమె ప్రశ్నించారు. ఏపీలో నాలుగేళ్లలో ఏమి అభివృద్ధి జరిగిందని ఆమె నిలదీశారు.

అమరావతిలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో పది శాతం అయినా ఏపీలో చేశారా అని ఆమె జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. అమరావతి మన రాజధాని అని ఆమె స్పష్టం చేశారు. మూడు రాజధానులు నినాదం తప్పుడు విధానం అని ఆమె చెప్పడం విశేషం. తాను అమరావతి రాజధాని ఎక్కడికీ పోదు అని చెబితేనే రైతులు తనకు ఓటేసి గెలిపించారని ఆమె అన్నారు.

అలాంటి అమరావతి రాజధానిని కాదడం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు అన్నారు. తాను అమరావతి రైతుల విషయంలో ఇంతకాలం ఉదాశీనంగా ఉండి తప్పు చేశాను అని ఆమె అంటున్నారు. ఇక మీదట అమరావతి రైతుల పక్షాల తాను పోరాడుతాను అని ఆమె అన్నారు ఈ రోజు నుంచి తన బానిస సంకెళ్ళు తెగిపోయాయని, తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆమె అన్నారు.

అమరావతి రైతులకు మహిళలకు తాను బాసటగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. తన కుమార్తె ఢిల్లీలో చదువుతోందని, ఏపీకి రాజధాని ఏదీ అని తన కుమార్తెను అంతా అడుగుతున్నారంటే ఏపీకి ఎంత పరువు తక్కువ అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి తాను వస్తే వైసీపీ గూండాలు బతకనిస్తారో లేదో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ ని చంపినట్లుగా తనను చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.

అందువల్ల తాను జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి తనకు ఏపీలో ఏమైనా జరిగితే దానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి కారకుడని ఫిర్యాదు చేసిన తరువాతనే ఏపీకి వస్తాను అని ఆమె అన్నారు. దిశ చట్టం అన్నారు. జీరో ఎఫ్ ఐ ఆర్ అన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేకే రక్షణ లేని రాష్ట్రం ఏపీ అని ఆమె దుయ్యబెట్టారు. ఏపీలో అంతా విద్వంసం అని అభివృద్ధి లేదని ఆమె అన్నారు.

ఏపీలో జగనన్న ఇళ్లు అన్నది అతి పెద్ద అవినీతి కుంభకోణం అని ఆమె విమర్శించారు. నాలుగేళ్ల పాలన అంతా దారుణంగా సాగిందని ఆమె అంటున్నారు. తాను ఒక డాక్టర్ గా ఉంటూ బాగా సంపాదించుకుంటున్నానని, అలాంటి తాను కోట్లు పుచ్చుకుని వేరే పార్టీకి ఓటు వేశానని చెప్పడం కంటే పచ్చి అబద్ధం మరోటి ఉండదని ఆమె అన్నారు.

ఎవరైనా తాను ఓటేసిన చోట బల్ల కింద కూర్చుని చూసారా అని ఆమె ప్రశ్నించారు. తాను క్రాస్ ఓటింగ్ చేశాను అని ఎలా చెప్పగలుగుతారని ఆమె నిలదీశారు. ఓటు అన్నది భారత రాజ్యాంగం ప్రకారం రహస్యమైనదని, దాన్ని అపహాస్యం చేస్తూ ఆ సాకుతో తనను పార్టీ నుంచి తప్పించారని ఆమె అవేదన వ్యక్తం చేశారు. తాను కోట్లు తీసుకోలేదని, వేరే పార్టీకి ఓటు వేయలేదని కాణీపాకం వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేస్తానని, అలా తీసుకున్నాను అని చెప్పిన వారు ప్రమాణం చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. మొత్తానికి ఉండవల్లి శ్రీదేవి సంచలన ఆరోపణమే చేశారు. మరి దీనికి కౌంటర్ వైసీపీ నుంచి ఉంటుందా అన్నదే చూడాలి.