సుప్రీం కోర్టు సీజేకు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన లేఖ

Sat Oct 17 2020 18:20:47 GMT+0530 (IST)

Undavalli Arun Kumar's sensational letter to the Supreme Court CJ

మనం ఓట్లేసిన నాయకులపై నమోదైన కేసుల విచారణను కోర్టులు లైవ్ లో చూపించాలని తాను సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు మెయిల్ ద్వారా లేఖ రాశానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ పై కేసులో టీడీపీ లక్ష కోట్లు అవినీతి అంటూ చాలా ఆరోపణలు చేసిందని.. కానీ సీబీఐ కేవలం 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే చార్జిషీట్ లో చూపించిందన్నారు.ఈ క్రమంలోనే ఓట్లేసిన ప్రజలకు అసలు ఈ కోర్టుల్లో ఏం జరుగుతుందో తెలిసేలా లైవ్ చూపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కోర్టులో శిక్ష పడితే ఎందుకు పడిందో తెలుస్తుందని.. కోర్టులంటేనే ఓపెన్ కోర్టులు అని.. ఇలా లైవ్ టెలికాస్ట్ చేయడం చాలా దేశాల్లో ఉందని.. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో లైవ్ టెలికాస్ట్ పెట్టాలని సుప్రీం కోర్టును కోరానని ఉండవల్లి తెలిపారు.

ఇప్పటికే కరోనా కారణంగా కోర్టులు వర్ఛువల్ విచారణ జరుపుతున్నాయని.. తాను రాజమండ్రిలో ఉండే ఇటీవల సుప్రీం కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యానని.. ప్రజల్లో అపోహలు తొలగాలంటే కోర్టుల్లో విచారణ లైవ్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరానని ఉండవల్లి కోరారు. మీడియా రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయాలని ఉండవల్లి కోరారు.

ప్రజలకు ఇంకోరకంగా చెప్పి బ్రెయిన్ వాష్ చేసి గందరగోళం చేసే వీలులేకుండా.. కోర్టుల్లో జరిగింది జరిగినట్టు చూపిస్తే ఇన్ని అనర్థాలు ఉండవని ఉండవల్లి అన్నారు. ఒక పేపర్లో ఒకలా ఉంటుందని.. మరో పేపర్లో మరోలా రాస్తున్నారని.. మనకేమో ఏది నమ్మాలో తెలియడం లేదని.. కొన్ని అధికార పార్టీ చానెల్స్ పత్రికలు ఉన్నాయని.. మరికొన్ని ప్రతిపక్ష చానెల్స్ పత్రికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కోర్టుల్లో జరిగింది జరిగినట్టుగా ప్రజలకు చూసేందుకు అవకాశం కల్పించినట్టైతే ఎలాంటి అపోహలు ఉండవని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు జరుగుతున్న విచారణ చాలా ముఖ్యమైన నేతలదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.. ఈ రాష్ట్రాన్ని 15 ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రిపై కేసు ఉందని.. ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓట్ షేరింగ్ సాధించి ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రిపై కేసు ఉందని.. రెండూ కూడా అవినీతి ఆరోపణల కేసులని.. అందుకే దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని తాను సుప్రీం కోర్టును కోరుతూ మెయిల్ చేశానని ఉండవల్లి తెలిపారు. అప్పుడే ప్రజల్లో క్లారిటీ వస్తుందని ఉండవల్లి అన్నారు.