సినిమాల్లో కనిపించే మేనమామలు.. రియల్ గా కనిపించారు ఆ పెళ్లిలో

Sat Mar 18 2023 09:44:55 GMT+0530 (India Standard Time)

Uncles who appear in movies.. appeared in real life in that wedding

వెండితెర మీద మేనకోడలి సెంటిమెంట్ చూపిస్తే.. అదెంతలా పండుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారిన కాలంతో పాటు మనుషులు మరింత మెటీరియలిస్టిక్ గా మారిపోయిన వేళ.. బంధాలు.. అనుబంధాలకు సంబంధించిన సీన్లు చూపిస్తే..స్టీరియో ఫోనిక్ సీన్లుగా ఎటకారం చేసుకుంటున్న పరిస్థితి. అందుకు తగ్గట్లే.. స్క్రిప్టులోనూ మార్పులు వచ్చేశాయి. రీల్ విషయాల్ని పక్కన పెట్టి.. తాజాగా రియల్ గా చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.ఏంటి? మేనకోడలి కోసం ముగ్గురు సోదరులు ఇంత పని చేశారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అవాక్కు అయ్యారా? అంటూ యాడ్ లో అడిగిన తీరులో.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నిజంగానే అవాక్కు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే.. సీన్ అంత భారీగా ఉంది మరి. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని బుర్దీ గ్రామానికి చెందిన హరేంద్ర.. రామేశ్వర్.. రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు.

తమ సోదరి సంతానమైన మేనకోడలి పెళ్లి సందర్భంగా భారీగా కానుకల్ని చదివించి.. తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె పెళ్లి సందర్భంగా ముగ్గురు మేనమామలు కలిసి రూ.3.21 కోట్ల ఆస్తుల్ని ఆమెకు ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ఇంత భారీగా మేనకోడలి కోసం మేనమామలు ఇచ్చిన కట్నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి వేడుక చుట్టుపక్కల గ్రామాల్లోనూ చర్చగా మారింది. దానికి కారణం లేకపోలేదు.

మేనకోడలి పెళ్లి సందర్భంగా ఈ ముగ్గురు మేనమామలు.. 10 ఎకరాల వ్యవసాయ భూమిని.. రూ.30 లక్షలు విలువ చేసే స్థలాన్ని.. 41 తులాల బంగారం.. మూడు కేజీల వెండి.. ట్రాక్టర్.. స్కూటీతో పాటు రూ.80 లక్షల క్యాష్ ఇచ్చారు. ఇక్కడితోనూ ఆగలేదు. తమ ఊళ్లోని ప్రతి ఒక్క ఇంటికి పెళ్లి సందర్భంగా వెండి నాణెన్ని బహుమతిగా అందజేశారు. వీరి అభిమానం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఇవాల్టి రోజుల్లోనూ మేనకోడలి కోసం మేనమామలు పెట్టిన ఖర్చు తెలిసిన వారు అవాక్కు కావటమే కాదు.. ఈ ఉదంతం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.  ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి సీన్ రీల్ లో అయినా చూశారా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.