Begin typing your search above and press return to search.

యూపీ సీఎం యోగి హెలిక్యాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెనుముప్పు

By:  Tupaki Desk   |   26 Jun 2022 10:32 AM GMT
యూపీ సీఎం యోగి హెలిక్యాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెనుముప్పు
X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ను పక్షి ఢీకొట్టడంతో ఎమర్జెన్సీ పైలెట్ ల్యాండింగ్ చేశారు. రెండురోజుల వారణాసి పర్యటన ముగించుకొని సీఎం యోగి ఆదివారం ఉదయం లక్నో బయలుదేరగా.. ఆయన హెలిక్యాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

యూపీ సీఎం యోగి ఇవాళ ఉదయం వారణాసి నుంచి లక్నోకు హెలిక్యాప్టర్ లో బయలు దేరారు. వారణాసి పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమాషాలకే చాపర్ ను ఓ పక్షి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలిక్యాప్టర్ కిటీకీ అద్దం పగిలిపోయినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా పైలట్ హెలికాప్టర్ ను హుటాహుటిన తిరిగి వారణాసి కి మళ్లింది. అదే పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత సీఎం యోగి ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా లక్నో బయలుదేరానని వారణాసి కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ పేర్కొన్నారు. వర్షకాలం కావడం.. వానల ప్రభావంతో పక్షుల వలసలు ఎక్కువయ్యాయని.. ఆ క్రమంలోనే ఓ పక్షి ఢీకొట్టి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఇక సీఎం హెలిక్యాప్టర్ ను పక్షి ఢీకొన్న ఘటనపై ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదని తెలుస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం వారణాసి వచ్చిన సీఎం యోగి.. కాశీ విశ్వనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సీఎం హెలిక్యాప్టర్ కు పెనుప్రమాదం తప్పడంతో అధికారులు, బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.