భారతదేశంలో ప్రస్తుతం అక్షరాస్యత రేటు 78 శాతం కాగా దీనిని వంద శాతం పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. విద్యారంగంలో రోజురోజుకు చోటు చేసుకున్న మార్పులు బేస్ చేసుకొని యూజీసీ కొత్త నిబంధనలను శ్రీకారం చుడుతోంది.
దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నంలో భాగంగా యూజీసీ సరికొత్త నిబంధనను తాజాగా తీసుకురానుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు నడుచుకుంటే దేశంలో వందశాతం అక్షరాస్యత సాధ్యమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నిబంధన చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో 'ఒకరికి సహాయం చేస్తే ఆ ఒక్కరు మరో ముగ్గురికి సహాయం చేయాలి' అనే కాన్సెప్ట్ ను పోలి ఉండటం గమనార్హం.
ఈ నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి యేటా కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సి ఉంటుంది. చదువు రాని వారికి చదువు చెప్పి అక్షరాస్యులుగా విద్యార్థులు మార్చడం ద్వారా దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతుందని యూజీసీ అంచనా వేస్తోంది. ఫలితంగా 2047 ఏడాది నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాల సరసన చేరుతుందని యూజీసీ చెబుతోంది.
విద్యార్థులు ఎవరైతే యేటా కనీస ఐదుగురిని అక్షరాస్యులుగా మారుస్తారో వారికి యూజీసీ క్రెడిట్ స్కోర్ ఇవ్వనుంది. దీనిని కోర్సు ముగింపులో వారి చివరి ఫలితానికి జోడించనున్నారు. ఫైనల్ రిజల్ట్ లో ఈ క్రెడిట్ స్కోర్ యాడ్ కానుంది. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారని యూజీసీ భావిస్తోంది.
ఈ ఏడాది నుంచే యూజీసీ ఈ నిబంధన అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయంలో వివరణాత్మకమైన మార్గదర్శకాలను విడుదల చేసి అమలు కోసం ప్రాజెక్టు వర్క్.. అసైన్మెంట్ కి లింక్ చేయాలనే చర్చ నడుస్తోంది. విద్యార్థులు నిరక్షరాస్యులకు విద్యను బోధించి వారికి అక్షరాస్యతతో కూడిన సర్టిఫికెట్ అందేలా చూసినప్పుడే మాత్రమే వారికి క్రెడిట్ స్కోరును యూజీసీ ఇవ్వనుంది.
తద్వారా నామమాత్రంగా చదువు నేర్పించామని చెప్పడానికి వీలు లేకుండా పోనుంది. దీని ద్వారా కచ్చితంగా నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారే అవకాశం దక్కనుంది. గ్రాడ్యుయేట్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ విధానాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలు చేయాలని యూజీసీ చూస్తోంది. స్టాలిన్ సినిమా తరహాలో యూజీసీ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.