Begin typing your search above and press return to search.

దిశ ఘటనకు రెండేళ్లు.. చట్టాలెన్ని వచ్చినా ఆగని దారుణాలు

By:  Tupaki Desk   |   27 Nov 2021 11:30 AM GMT
దిశ ఘటనకు రెండేళ్లు.. చట్టాలెన్ని వచ్చినా ఆగని దారుణాలు
X
మహిళలు, యువతులు, చిన్నారులన్న తేడాలేదు వావీ వరుసలు అస్సలు లేవు. మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. హైదరాబాద్ శివారులో దిశపై అత్యాచారం యావత్ దేశ ప్రజల మనసులను చలింపజేసిన ఘటన. మానవ మృగాళ్ల అరాచకాలతో సభ్య సమాజం తలదించుకున్న ఘటన అది. ఆ రాత్రే తనకు కాలరాత్రి అని తెలియక దుర్మార్గుల చేతిలో అత్యాచారం కావించబడిన దిశ ఘటన జరిగి సరిగ్గా రెండేళ్లు.

దిశా... ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అన్నీ కూడా విస్మయం వ్యక్తం చేశాయి. శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌ గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశ బైక్‌‌ కు పంచర్ చేసి డ్రామా ఆడి అనంతరం బలవంతంగా తీసుకెళ్లి నలుగురు దుర్మార్గులు హైదరాబాద్ శివారుల్లో షాద్‌ నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి కిరాతకంగా సజీవ దహనం చేయడం చాలా మందిని కలవరపెట్టింది.

ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత విచారణ చేపట్టారు. ఘటన జరిగిన మరుసటి రోజే కేసును చేధించి వెంటనే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరగడమే కాకుండా వాళ్ళను కాల్చి చంపాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.

నలుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో వారిని జైలుకు తీసుకెళుతుండగా ప్రజలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విచారణంలో భాగంగా నలుగురు నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్లగా వారు ఎదురు తిరిగి పోలీసులుపై దాడికి దిగడంతో ఎన్‌ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. అప్పుడు జరిగిన పోలీసుల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

దిశ నిందితుల ఎన్‌ కౌంట‌ర్‌ పై ప్రజ‌లు హ‌ర్షాతిరేకాలు వ్యక్తం చేసినా మానవహక్కుల సంఘంతో పాటు ప‌లు సంఘాలు తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశాయి. ఉద్దేశ‌పూర్వకంగానే నిందితుల‌ను చంపేశారంటూ పోలీసుల‌పై ఫిర్యాదు చేశాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప‌లు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాటి పై ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే, ఈ సంఘటన తర్వాత పోలీస్‌ శాఖలో కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ అనే విధానం అమలులో ఉన్నా, ఈ విధానాన్ని పటిష్టం చేయాలని అప్పట్లో పోలీస్‌ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

అలాగే డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ పట్ల నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే స్పందించాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వెలవడ్డాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధం గా ఏపీ సర్కార్ దిశ చట్టాన్ని రూపొందించి, అమల్లోకి తీసుకొచ్చింది. దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా మృగాళ్లలో మార్పు మార్పురాలేదు. ఇలాంటి ఘటనలు ఇంకా అనేక చోట్ల వెలుగుచూస్తూనే ఉన్నాయి.

మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.

దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్‌ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.