Begin typing your search above and press return to search.

ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు వేరియంట్లు...భారత్ లో ఇదే తొలి కేసు !

By:  Tupaki Desk   |   20 July 2021 10:57 AM GMT
ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు వేరియంట్లు...భారత్ లో ఇదే తొలి కేసు !
X
మనదేశం లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు తగ్గుతుంది. అయితే సెకండ్ వేవ్ జోరు తగ్గుతుంది అని అనుకునే లోపే మూడో వేవ్ ముప్పు పొంచుకొస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే దేశంలో రోజుకో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వస్తుంది. ఈ తరుణంలో దేశంలో మొదటిసారి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అస్సాంకు చెందిన ఓ మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

దీనిని దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా వైద్య నిపుణులు అంచనాకు వచ్చారు. ఇక డబుల్ ఇన్ఫెక్షన్‌పై ఐసీఎంఆర్‌ అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే... ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నారు.

అయినప్పటికీ రెండు వేరియంట్లు వచ్చాయంటే , దీని బట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పటివరకూ దేశంలో ఎవరికీ ఇలా రెండు కరోనా వేరియంట్లు సోకలేదు.

ఆమె శాంపిల్స్‌ని ల్యాబ్‌ లో టెస్ట్ చేశారు. డెల్టా, ఆల్ఫా వేరియంట్లు ఉన్నాయి. ఎందుకైనా మంచిదని, మరోసారి శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేశాం. అప్పుడు కూడా అదే ఫలితం వచ్చింది. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు కన్ఫామ్ చేసుకున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి.

హోం ఐసోలేషన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే ఆమె కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు కూడా వేయించుకున్నారు. అటు ఆమె భర్త మొదట ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు. తద్వారా ఈమెకు కరోనా సోకింది అని ఐసీఎంఆర్ అధికారి విశ్వజ్యోతి బొర్కాకొటి తెలిపారు.

నిజానికి ఆమె వ్యాక్సిన్ వేయించుకోకపోయి ఉంటే, రెండు వేరియంట్ల కారణంగా ఆమె పరిస్థితి దారుణంగా ఉండేది. 2 డోసులూ వేసుకోవడం వల్ల ఆమెకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా లేదు. అంటే దానర్థం వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కరోనా సోకినా అది అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అనుకోవచ్చు.

ఆ మధ్య బెల్జియంకు చెందిన 90 ఏళ్ల ముసలామెపై కూడా డబుల్ వేరియంట్లు దాడి చేశాయి. ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు బాడీలోకి ప్రవేశించాయి. వయసు ఎక్కువ కావడం వల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తట్టుకోలేక చనిపోయింది. ఆమె వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా వేసుకోలేదు. అంటే దానర్థం... వ్యాక్సిన్ వేయించుకోని వారికి డబుల్ వేరియంట్లు సోకితే... వారు చనిపోయే ప్రమాదం కూడా ఉందని అనుకోవచ్చు. ఇలా ఈ డబుల్ ఎటాక్ కేసు మనకు ఎన్నో విషయాలు నేర్పుతోంది. మనల్ని వ్యాక్సిన్ వేయించుకోమని అలర్ట్ చేస్తోంది.