వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

Mon Mar 20 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Twists in YS Viveka Murder Case

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం విచారణ వేగం పుంజుకుంది. వివేకా కుమార్తె వైఎస్ సునీత కోరిక మేరకు ఈ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు మార్చాక విచారణ చురుగ్గా సాగుతోంది. దీంతో విచారణను అడ్డుకోవడానికి నిందితులు పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వివేకా హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతోపాటు సీబీఐ.... వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగుసార్లు విచారించింది. మరోవైపు అవినాష్ తండ్రి పులివెందుల వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి వైఎస్ భాస్కరరెడ్డికి సైతం సీబీఐ విచారణకు హాజరుకమ్మని నోటీసులు జారీ చేసి ఒక పర్యాయం విచారించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కరరెడ్డి తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.  వివేక హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలను íసీబీఐ విచారించింది.

ఈ నేపథ్యంలో దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో..దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీబీఐ చెప్పినట్టు దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేనని భాస్కరరెడ్డి తన పిటిషన్ లో వెల్లడించారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని తన పిటిషన్ లో భాస్కర రెడ్డి కోర్టుకు విన్నవించారు. దీంతో వివేకా మర్డర్ మరో మలుపు తిరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.