Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. పోటీ నుంచి ఆ నేత ఔట్!

By:  Tupaki Desk   |   30 Sep 2022 10:57 AM GMT
కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విస్టుల మీద ట్విస్టులు.. పోటీ నుంచి ఆ నేత ఔట్!
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ‌ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్ర‌క్రియ‌ సీరియ‌ల్ మీద సీరియ‌ల్ ను న‌డిపిస్తోంది. ముందుగా ఖాయ‌మ‌నుకున్న అభ్య‌ర్థులు మారిపోతున్నారు. అస‌లు ఎవ‌రి ఊహ‌లో లేని అభ్య‌ర్థులు చివ‌రికి తెర‌మీద కొస్తున్నారు.

రాజ‌స్థాన్ ప‌రిణామాల‌తో ఇప్ప‌టికే కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నుంచి అశోక్ గెహ్లోత్ ఔట్ అయిపోయారు. ఆయ‌న పోటీ చేసి ఉంటే ఆయ‌న‌నే అధ్య‌క్షుడిని చేయాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అయితే ముఖ్య‌మంత్రి మార్పులో గెహ్లోత్.. సోనియా అభీష్టానికి వ్య‌తిరేకంగా న‌డుచుకోవ‌డంతో అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రి నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు.

అశోక్ గెహ్లోత్ స్థానంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. సోనియా, రాహుల్ గాంధీల‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడు కావ‌డంతో దిగ్విజ‌య్ సింగ్ పోటీ ఖాయ‌మ‌నుకున్నారు. అయితే తాను కూడా పోటీ చేయ‌డం లేద‌ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే పోటీ చేస్తార‌ని.. అందువ‌ల్ల తాను బ‌రిలో నుంచి త‌ప్పుకుంటాన‌ని వెల్ల‌డించారు.

దీంతో ఇక కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి పోటీ తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే మ‌ధ్యే పోటీ ఉండే అవ‌కాశం ఉంది. అయితే అధిష్టానం పూర్తి మ‌ద్ద‌తు, కాంగ్రెస్ నేత‌ల్లో అత్య‌ధికుల మ‌ద్ద‌తు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకే ఉండ‌టంతో ఆయ‌నే అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టే వీలుంది.

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డానికి సెప్టెంబ‌ర్ 30 చివ‌రి తేదీ. దీంతో ఈ ఇద్ద‌రు నేత‌లు శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేస్తార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలో సంస్క‌ర‌ణ‌లు కావాల‌ని.. యువ‌త‌రానికి పెద్దపీట వేయాల‌ని ఇటీవ‌ల జీ-23 పేరుతో కాంగ్రెస్ నేత‌లు అధిష్టానానికి లేఖ సంధించిన విష‌యం తెలిసిందే. వీరిలో శ‌శిథ‌రూర్ కూడా ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్హం. కాగా జీ-23 నేత‌ల్లో మ‌రికొంత‌మంది అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉండాల‌ని స‌మావేశ‌మయ్యారు. అయితే చివ‌ర‌కు త‌మ‌లో ఎవ‌రూ పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.

అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానని జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి ప్రకటించ‌డం విశేషం. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని సోనియా గాంధీ చెప్పారని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీలో నిలిచిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఒక టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్ర‌మేన‌ని తెలిపారు. అధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తాను సోనియా గాంధీతో భేటీ అయినప్పుడు త‌న పోటీని సోనియా గాంధీ స్వాగ‌తించార‌ని గుర్తు చేశారు. తాను ఆమె ఆమోదం కోసం సోనియాను క‌ల‌వ‌లేద‌ని.. వారి అధికారిక వైఖ‌రి ఏమిటో తెలుసుకోవ‌డానికి భేటీ అయ్యాన‌ని వెల్ల‌డించారు.

తాను సోనియాతో భేటీ అయిన‌ప్పుడు... మీరెందుకు పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని ఆమె త‌న‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని శ‌శిథ‌రూర్ చెప్పారు. పైగా ఎన్నిక‌లు జ‌రిగితే పార్టీకి మంచిద‌ని.. మీరు పోటీ చేయాల‌నుకుంటే తాను స్వాగ‌తిస్తాన‌ని ఆమె తెలిపార‌న్నారు. ఎన్నిక‌ల ద్వారా స‌రైన వ్య‌క్తి కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎంపిక‌వుతార‌ని సోనియా చెప్పార‌న్నారు.

ఇప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికారిక అభ్య‌ర్థి ఎవ‌రూ ఉండ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పోటీ స‌హ‌చ‌రుల మ‌ధ్యే జ‌రుగుతుంద‌ని శ‌శిథ‌రూర్ తెలిపారు. త‌న‌కు 14 ఏళ్ల అనుభవం ఉంద‌ని.. అన్ని రకాలుగా పోటీకి తాను అర్హుడినేన‌న్నారు. త‌న‌ అభ్యర్థిత్వంపై ఎవ‌రికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యే వ్య‌క్తి గాంధీల చేతుల్లో కీలుబొమ్మగా మారతారా? అనే ప్ర‌శ్న‌కు శ‌శిథ‌రూర్ స‌మాధాన‌మిచ్చారు. ‘కాంగ్రెస్‌లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్‌ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు.’ అని పేర్కొన్నారు థరూర్‌. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి రాహుల్‌ గాంధీ నిరాక‌రించినా ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్‌గానే ఆయ‌నే క‌నిపిస్తార‌ని శశిథ‌రూర్ చెప్ప‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.