చంద్రబాబుకు తిప్పలు తప్పవా?

Tue May 04 2021 11:01:52 GMT+0530 (IST)

Twist in the vote For note case

ఓటుకు నోటు కేసులో పీకల్లోతులోకి ఇరుక్కుపోయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదురుకానున్నాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పిన వైనం తాజాగా చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారటమే కాదు.. ఎన్నో పరిణామాలకు మూలమైన ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం తాజాగా జరిగింది.తాజాగా ఏసీబీ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో పాటు.. రూ.50 లక్షల అడ్వాన్సును రేవంత్ రెడ్డి అండ్ కో స్టీఫెన్ కు ఇచ్చేందుకు వేదికగా ఉన్న  మార్కం టేలర్ కూడా కోర్టుకు సాక్ష్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజున ఏం జరిగిందో వివరించారు.  ‘‘మన వాళ్లు అంతా బ్రీఫ్ మీ’’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. అప్పట్లో బాబు అన్నట్లుగా బయటకు వచ్చిన ఆడియో టేప్ ను కోర్టులో వినిపించారు. ఆ సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. అది చంద్రబాబు గొంతేనని స్పష్టం చేశారు.

వారు చెప్పిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టిన వైనాన్ని కోర్టుకు నివేదించారు. ఆడియో టేప్ తో పాటు.. బ్యాగులో నుంచి రూ.50 లక్షల మొత్తాన్ని బయటకు తీస్తున్న వీడియోను ప్లే చేయగా.. అది తన ఇంట్లోనే జరిగిందని మార్కంటేలర్ అంగీకరించారు. స్టీఫెన్ సన్ ఇంట్లో కలవటానికి రేవంత్ ఇష్టపడకపోవటంతో.. మార్కం టేలర్ ఇంట్లో కలిశారు.

లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్.. స్టెబాస్టియన్.. రుద్ర ఉదయ సింహలు ఉన్నట్లుగా కోర్టుకు చెప్పారు.  ఈ కేసు విచారణ సందర్భంగా జరిగి ఉదంతాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతున్న మార్కం టేలర్ కుమార్తెను కూడా కోర్టుకు వచ్చి.. వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తాజాగా ఏసీబీ కోర్టులో జరిగిన ఉదంతాల్ని చూస్తే.. ఈ కేసులో చంద్రబాబుకు తిప్పలు తప్పవన్న భావన కలిగినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.