Begin typing your search above and press return to search.

తుర్కియే.. సిరియాలో కొనసాగుతున్న 'మరణ మృదంగం'..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 PM GMT
తుర్కియే.. సిరియాలో కొనసాగుతున్న మరణ మృదంగం..!
X
అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే సిరియా.. టర్కీ దేశాలు చాలా నష్టపోయాయి. ఇది చాలదన్నట్లుగా తుర్కీయే.. సిరియా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన భూకంపాలు రావడంతో అపార నష్టం వాటిల్లింది. గంటల వ్యవధిలో మూడు భూకంపాలు రావడంతో భారీ భవనాలు సైతం పేకమేడలా కుప్పకూలాయి. ఈ ఘటనలో నిన్నటికే 2300 మృతిచెందగా వేలాది మంది క్షతగాత్రుల గా మారారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రెండ్రోజుల వ్యవధిలో తుర్కీయే.. సిరియా ప్రాంతాల్లో 200లకు పైగా భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. తుర్కీయేలో గత 84 ఏళ్లలోనే ప్రస్తుతం రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన తాజా భూకంపమే అతిపెద్ద భూకంపమని నివేదికలు చెబుతున్నాయి. ఈ భూకంపం తర్వాత 7.5 తీవ్రతతో ఒకసారి.. 6 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.

సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో పదేపదే భూకంపాలు సంభవించడంతో ఆస్తి.. ప్రాణనష్టం తీవ్రంగా జరిగినట్లు తెలుస్తోంది. శిథిలమైన భవనాలు తొలగించే క్రమంలో వరుస భూప్రకంపనలు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. తుర్కియేలో ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతిచెందగా సిరియాలో మరో వెయ్యి మంది దాకా మృతి చెందినట్లు సమాచారం.

ఈ పెనువిపత్తు కారణంగా తుర్కియేలో 20వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సిరియాలో మరో 2వేల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పదేపదే భూ ప్రకంపనలు వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టర్కీ.. సిరియా దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారికి వెలికితీసే క్రమంలో హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మరోవైపు సిరియాలో తాజా భూకంపం వల్ల స్థానికంగా ఉగ్రవాదులను బంధించిన జైలు ధ్వంసమైంది. ఈ జైల్లో ఉంటున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాలు తప్పించుకోని పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడడంతో కలకలం మొదలైంది. ఇప్పటికే భూకంపం కారణంగా సిరియా.. తుర్కియే భారీగా నష్టపోగా.. తప్పించుకుపోయిన ఉగ్రవాదుల వల్ల ఇంకెంత నష్టం జరుగుతుందోననే ఆందోళన అందరిలో నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.