Begin typing your search above and press return to search.

ప్రైవేట్‌ పార్టీ లో అమెరికా రహస్యాలు లీక్ చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   10 Jun 2023 2:20 PM GMT
ప్రైవేట్‌ పార్టీ లో అమెరికా రహస్యాలు లీక్ చేసిన ట్రంప్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రహస్య పత్రాల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు అనేక ప్రభుత్వ రహస్య పత్రాలను తనతో పాటు తన నివాసానికి తీసుకెళ్లిపోయారని ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ కేసు నమోదు చేశారు.

వేలాది మంది హాజరయ్యే సోషల్ ఈవెంట్స్ జరిగే చోట భద్రత లేకుండా వీటిని పడేశారని ఆరోపించారు. వీటిలో పెంట గాన్, సీఐఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు తెలిపారు.

ట్రంప్‌ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో అమెరికా అణు కార్యక్రమ ప్లాన్స్, అమెరికా సహా మిత్ర దేశాలకు పొంచి ఉన్న సైనిక ముప్పు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రచించిన ప్రణాళికల వంటి కీలక వివరాలు ఉన్నట్లు అభియోగాల్లో వెల్లడించారు. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్ర వాద సంస్థకు ఓ దేశం మద్దతిస్తున్నట్లు ఉన్న ఆధారాలను సైతం ట్రంప్‌ తీసుకెళ్లిన రహస్య పత్రాల్లో ఉన్నాయని సమాచారం.

అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్‌, నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఇతర నిఘా సంస్థల నుంచి అందిన అనేక పత్రాలు అందులో ఉన్నట్లు అభియోగాల్లో ఉంది. ఇరాన్‌ పై దాడికి సంబంధించిన అత్యంత రహస్య మైన ప్రణాళికలను 2021 వ సంవత్సరంలో జూన్‌ లో ట్రంప్‌ న్యూజెర్సీలోని తన గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన ప్రైవేట్‌ పార్టీకి హాజరైన అతిథులతో షేర్‌ చేసుకున్నారని నేరాభియోగాల్లో పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమనీ.. దీన్ని అత్యంత రహస్య సమాచారం కింద వర్గీకరించామని కూడా ఆయన అందరి ముందూ అంగీకరించినట్లు వెల్లడించారు.

మరో సందర్భంలో 2021వ సంవత్సరంలో సెప్టెంబరులో అమెరికా మిలిటరీకి చెందిన ఓ కీలక మ్యాప్‌ ను ట్రంప్‌ తన పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీలోని ఓ అనధీకృత వ్యక్తితో పంచుకున్నట్లు తెలిపారు. అలాంటి సమాచారం తెలుసుకునే అర్హత సదరు వ్యక్తికి లేదని.. పైగా అతడికి సెక్యూరిటీ క్లియరెన్స్‌ కూడా లేదని అభియోగాల్లో వెల్లడించారు.