Begin typing your search above and press return to search.

పెట్రోల్ ప్రస్తావన తీసుకొచ్చి టీఆర్ఎస్ తప్పు చేస్తోందా?

By:  Tupaki Desk   |   24 Oct 2021 1:30 PM GMT
పెట్రోల్ ప్రస్తావన తీసుకొచ్చి టీఆర్ఎస్ తప్పు చేస్తోందా?
X
పోటాపోటీగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఏ చిన్న తప్పు జరగటానికి ప్రధాన పార్టీలు ఇష్టపడని పరిస్థితి. పేరుకు త్రిముఖ పోరు అని చెప్పినా.. పోటీ మాత్రం బీజేపీ -టీఆర్ఎస్ మధ్యనే ఉందన్నది వాస్తవం. నిజానికి బీజేపీకి అవకాశం లేకున్నా.. ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి.. టీఆర్ఎస్ తో నేరుగా తలపడే అవకాశం బీజేపీకి దక్కింది. ఇలాంటివేళ.. ప్రతి అంశాన్ని ఎన్నికల ప్రచారానికి వాడేస్తున్నాయి రెండు పార్టీలు.

ఇలాంటివేళ.. అనూహ్యంగా పెట్రోల్.. డీజిల్ ధరల ప్రస్తావనను తీసుకొచ్చారు గులాబీ నేతలు. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరల గురించి ప్రస్తావించటం ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది టీఆర్ఎస్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే.. అనూహ్యంగా సరికొత్త వాదనను తీసుకొచ్చిన బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశారన్న మాట వినిపిస్తోంది.

ఇవాల్టి రోజున లీటరు పెట్రోల్ దగ్గర దగ్గర రూ.110 వరకు వచ్చేసిన వేళలో.. ఇంత భారీగా ధర పెరగటానికి కేంద్రంలోని మోడీ సర్కారు కారణమన్న మాట బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలు సైతం ఇదే విషయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. గులాబీ నేతలు తీసుకొచ్చిన పెట్రోల్ ధర ప్రస్తావనపై కమలనాథులు కొత్త తరహా కౌంటర్ ను సిద్ధం చేశారు. పెరిగిన ధరల గురించి మాట్లాడని వారు.. తాజా పెట్రోల్ ధరలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను వాటా కింద రూ.40 వస్తుందని.. దాన్ని ఎందుకు తగ్గించరు? అని సూటి ప్రశ్నను సంధిస్తున్నారు.

కేంద్రాన్ని ధర తగ్గించాలని ప్రశ్నించే ముందు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు అవకాశం ఉన్న పన్ను పోటు నుంచి భారం తగ్గించొచ్చు కదా? అన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. లీటరు పెట్రోల్ మీద ప్రభుత్వానికి రూ.40 చొప్పున వస్తున్నప్పుడు.. ఆ పన్ను మొత్తంలో కొంత మొత్తాన్ని అయినా తగ్గిస్తూ.. కేంద్రం వేస్తున్న భారానికి తమకు తోచినంత రిలీఫ్ ను ఇస్తున్నామన్నట్లుగా నిర్ణయం తీసుకొని ఉంటే బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడేవారు. అలాంటిదేమీ లేకుండా బీజేపీ నేతల్ని..మోడీసర్కారును టార్గెట్ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోగా.. సెల్ఫ్ గోల్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. లీటరు పెట్రోల్ ధరను ప్రస్తావిస్తూ.. పెరిగిన భారాన్ని ప్రస్తావించే వేళ.. తమకు వచ్చే పన్ను ఆదాయం మీద గులాబీ నేతలు స్పష్టతను ఇచ్చి.. ఆ వాటాలో కొంత మొత్తాన్ని ప్రజలకు ఇచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదేమో?