Begin typing your search above and press return to search.

అప్పుడే టిక్కెట్ లొల్లి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలు షాక్

By:  Tupaki Desk   |   13 July 2020 4:00 AM GMT
అప్పుడే టిక్కెట్ లొల్లి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలు షాక్
X
తెలంగాణలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ కీలక నేతల మధ్య కోల్డ్ వార్ కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారట. ఏకంగా ప్రస్తుత ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని... గతంలో ఈ టిక్కెట్ కోసం పోటీ పడ్డవారు, కొత్తగా తెరపైకి వచ్చిన వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రతి అంశంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం, కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడంపై రెండోస్థాయి కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని చెవులు కొరుక్కుంటున్నారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది టీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీపడగా, చివరకు విద్యాసంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డిని వరించింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రత్యర్థులు వ్యతిరేకంగా పావులు కదపడం, కుటుంబానికే పదవుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడంతో రెండోస్థాయి కేడర్‌లో నిరుత్సాహం, ఆవేదన కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడున్నర సంవత్సరాలు ఉండగానే టిక్కెట్ కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టారట. వారి ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఇదే జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ బానుప్రసాద్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధులతో సన్నిహితంగా ఉంటున్న పలువురు నేతలు.. ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గంలో రాజకీయం నెరుపుతున్నారట. వీటిని ఎదుర్కొంటూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోడలు మమతా రెడ్డిని తెరపైకి తెచ్చారు మనోహర్ రెడ్డి. అప్పటికే ఈ పదవిని ఆశించిన వారు తమకు భంగపాటు కావడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. కరోనా సమయంలో మున్సిపల్ చైర్మన్ కనిపించడం లేదంటూ సొంత పార్టీ నేత, మాజీ చైర్మన్ రాజయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ తర్వాత అతనిపై రెండు కేసులు నమోదు కావడంతో దీని వెనుక ఎమ్మెల్యే వర్గం ఉందని ఆరోపిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ పెద్దపల్లి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. ఈయనకు ముఖ్య అనుచరుడు రాజయ్య. ఈయనతో పాటు శంకర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి ఇలా పలువురు అధికార పార్టీ నుండి పోటీ చేయాలని భావించారు. 2023లో ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలని భావిస్తున్న పలువురు నేతలు ఎమ్మెల్యే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం కోడలు సీటు కాపాడుకోవడంతో పాటు వచ్చేసారి మరోసారి టిక్కెట్ దక్కించుకోవడం మనోహర్ రెడ్డికి పెద్ద సవాల్ అంటున్నారు.