వాజ్ పేయ్ పై ఆ గవర్నర్ షాకింగ్ ట్వీట్

Thu Aug 16 2018 13:07:17 GMT+0530 (India Standard Time)

Tripura Governor Tathagata Roy announces Vajpayee is dead

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఆయనకు చికిత్స చేస్తున్న ఎయిమ్స్ వైద్యులు తాజాగా విడుదల చేసిన నివేదికలోనూ ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉందంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇలాంటి వేళ.. ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఇక లేరంటూ ఆయన చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ట్వీట్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆయన చేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ గా మారి.. విమర్శలు వెల్లువెత్తటంతో ఆయన నాలుక్కర్చుకొని తాను చేసిన ట్వీట్ మీద వివరణ ఇచ్చారు.

తాను పోస్ట్ చేసిన ట్వీట్ ను తొలగిస్తూ.. క్షమాపణలు చెబుతూ.. ఓ ఆలిండియా టీవీ ఛానల్ లో వచ్చిన వార్తను చూసి తాను అలాంటి ట్వీట్ చేశానే తప్పించి మరో ఉద్దేశం లేదన్నారు. తనను క్షమించాలని కోరారు. తాను అలాంటి  ట్వీట్ చేసే ముందు నిజమా?  కాదా?  అన్నది తెలుసుకొని ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు.

వాజ్ పేయ్ వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకుండానే ఒక గవర్నర్ స్థానంలో ఉన్న వారు ఈ తరహా ట్వీట్ చేయటం సరికాదని పలువురు తప్పు పట్టారు. సంతాప సందేశాల్ని పోస్టుచేసే టప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత విడుదల చేస్తే బావుంటుందని పలువురు పేర్కొంటున్నారు.