Begin typing your search above and press return to search.

బెంగాల్ లో ట్రిపుల్ మ్యుటెంట్ కలకలం... దేశంలో మరింత విధ్వంసం తప్పదా?

By:  Tupaki Desk   |   22 April 2021 9:30 AM GMT
బెంగాల్ లో ట్రిపుల్ మ్యుటెంట్ కలకలం... దేశంలో మరింత విధ్వంసం తప్పదా?
X
కరోనా వైరస్ డబుల్ మ్యుటెంట్ వైరస్‌ తో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్ వెలుగులోకి రావడంమరింత వణుకుపుట్టిస్తోంది. దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ కరోనా వైరస్ ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకమైన జన్యువుతో, రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే కొత్త స్ట్రెయిన్‌ B.1.618 రకం వైరస్‌ పశ్చిమ బెంగాల్‌ లో వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్‌ వేరియంట్ ‌గా చెప్పుకొనే డబుల్‌ మ్యుటెంట్‌ B.1.617 ఎక్కువ వ్యాప్తిలో ఉంది.

రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండడం వల్ల ఇది ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వ్యాధి కారక కీలక స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలో E484Q, L452R రెండు స్ట్రెయిన్‌ లు కలిసి ఏర్పడటంతో డబుల్‌ మ్యుటెంట్‌ అంటున్నారు. E484Q స్ట్రెయిన్ యూకే, దక్షిణాఫ్రికా నుంచి, L452R స్ట్రెయిన్ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వ్యాపించాయి. ఈ రెండూ కలిసి దేశీయంగా డబుల్‌ మ్యుటెంట్‌ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజాగా బెంగాల్‌ లో గుర్తించిన ట్రిపుల్‌ మ్యుటెంట్‌ B.1.618 రకం స్ట్రెయిన్‌ స్పైక్‌ ప్రొటీన్ ‌లో E484Q, D614G రకాలు కలిగి ఉండటం వల్ల కొత్త లక్షణాలతో వ్యాప్తి సామర్థ్యాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ శాస్త్రవేత్త వినోద్‌ స్కారియా తెలిపారు. ఇది మరింత వేగంగా వ్యాపించగల రకం అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిపై మరింత విస్తృత పరిశోధన నిర్వహించాల్సి ఉందని అన్నారు.

గతేడాది అక్టోబరు 25న బెంగాల్ స్ట్రెయిన్‌ను ఓ బాధితుడిలో తొలిసారి గుర్తించగా.. ఈ జనవరి నాటికి ఇది చాలా పెద్ద సంఖ్యలో పెరిగినట్టు కనుగొన్నారు. B.1.618 అనేది దేశవ్యాప్తంగా గత రెండు నెలల నుంచి వ్యాప్తిలో ఉన్న మూడో అత్యంత సాధారణ వేరియంట్.. దేశంలో దాదాపు 12 శాతం కేసులకు ఇది కారణమైంది. డబుల్ మ్యుటేంట్ B.1.617, 28 శాతం, యూకే వేరియంట్ B.1.1.7 తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మ్యుటేషన్ లో రోగ నిరోధక శక్తిని తట్టుకొని నిలబడటం వలన మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రిపుల్ మ్యుటేషన్ పై మరింత పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.