Begin typing your search above and press return to search.

ఏపీకి చెందిన 'జమ్మే' అనే మహిళ గురించి తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు

By:  Tupaki Desk   |   1 April 2023 9:56 AM GMT
ఏపీకి చెందిన జమ్మే అనే మహిళ గురించి తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు
X
ఏపీ అన్నంతనే.. అక్కడ వారికి కులాల మీద ఉన్న ధ్యాస మరి దేని మీద ఉండదని.. తెలంగాణ వారి మాదిరి తమ ప్రాంతం మీద వారికి పెద్దగా అభిమానం ఉండదన్న మాట తరచూవినిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని పలువురు నేతల నోటి నుంచి రావటం కనిపిస్తుంటుంది. ఇలాంటి వేళ మారుమూలన ఉన్న జిమ్మే లాంటి మహిళ గురించి తెలిసినప్పుడు.. ఇలాంటి ఆణిముత్యాలు మొత్తం జాతికే ఆదర్శంగా నిలుస్తారు.

అంతేకాదు.. అప్పటివరకున్న అక్కడి ప్రజల మీద ఉన్న అభిప్రాయాల్ని మార్చేలా చేస్తాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక ఉత్తరాంధ్ర గిరిజన మహిళ జమ్మే. ఆమె చేసిన పని గురించి ప్రపంచానికి తెలిసేలా చేసిన క్రెడిట్ బీబీసీకి దక్కుతుంది. ఇంతకూ ఆమె ఎవరు? ఆమేం చేసిందన్నది తెలిస్తే.. ఆమెకు రెండు చేతులు ఎత్తి గౌరవపూర్వకంగా దండం పెట్టకుండా ఉండలేరు.

అల్లూరి సీతారామరాజు జిల్లా జోలాపుట్ రిజర్వాయర్ ను అనుకొని ఆంధ్రా.. ఒడిశా సరిహద్దుల్లోని తోటగొడిపుట్ అనే గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆమె భర్త.. డ్రైవర్ గా పని చేస్తున్నారు. మట్టి రోడ్డు కూడా లేని తోటగొడిపుట్ గ్రామానికి వెళ్లాలంటే గొడిపుట్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు కొండ మీదకు నడవాల్సిందే. అప్పుడే ఊరికి చేరుకుంటాం. మట్టి రోడ్డు కూడా లేని ఈ గ్రామంలో జోలాపుట్ రిజర్వాయరు గట్టును ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉండే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సామలు.. రాగులు వంటి పంటల్ని పండించి జీవనం సాగిస్తుంటారు.

ఈ ఊరి నుంచి ఇతర ఊళ్లకు వెళ్లటానికి.. తిరిగి రావటానికి కష్టంగా ఉండటం.. బడి.. ఆసుపత్రి ఇలా దేనికి వెళ్లాలన్నా కూడా కొండ కిందకు దిగి రావటం కష్టమయ్యే పరిస్థితి. దీంతో.. అక్కడున్న కుటుంబాలు నెమ్మదిగా వెళ్లిపోవటం మొదలెట్టాయి. సౌకర్యాలున్న గ్రామానికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ ఊళ్లో ఉన్నది తొమ్మిది కుటుంబాలు మాత్రమే. తన చిన్నతనంలో చాలామంది కనిపించేవారని.. ఇప్పుడు ఊళ్లో ఎవరూ ఉండటం లేదని వేదనతో చెబుతారు అక్కడి గ్రామస్తులు.

ఊళ్లో పరిస్థితులతో ఊరి నుంచి వెళ్లిపోవాలనుకున్న ఆమె.. తన ఆలోచన మార్చుకుంది. ఊరి కోసం తన సొంతింటి కలను నెరవేర్చుకోవటం కోసం దాచిన డబ్బులతో గ్రామానికి రోడ్డు వేస్తే ఎలా ఉంటుందని భావించిన ఆమె.. ఊరి కోసం తన డబ్బుల్ని రోడ్డు నిర్మాణం కోసం వెచ్చించటం ఇప్పుడు సంచలనంగా మారింది. తోటగొడిపుట్ గ్రామానికి చేరుకునేందుకు జరుగుతున్న రోడ్డుపనులు సగానికి పైగా పూర్తి అయ్యాయి.

ఇంకొంత జరిగితే.. గొడిపుట్ గ్రామం నుంచి తోటగొడిపుట్ కు చేరుకునేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం సాగుతోంది. నాలుగేళ్లు పాటు దాచుకున్న రూ.2 లక్షల మొత్తాన్ని ఊరిరోడ్డు కోసం వెచ్చిస్తున్న జమ్మే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోడ్డు కోసం అధికారుల్ని అడిగి.. అడిగి విసిగిపోయి.. తన సొంతిల్లు కంటే కూడా ఊరి రోడ్డే ముఖ్యమని తాను భావించానని.. తన భర్త కూడా సహకరించారని చెబుతున్న ఈ మహిళకు వినమ్రతతో దండం పెట్టకుండా ఉండలేం.

అరకు సమీపంలోని చిన్నంజుడు గ్రామంలో పుట్టిన జమ్మే.. తమ ఊళ్లో అన్ని సౌకర్యాలు ఉండేవి. పెళ్లి తర్వాత తోటగొడిపుట్ కు రావటంతో అంతా కొత్తగా అనిపించేదని.. తర్వాత అలవాటు పడిపోయినట్లు చెప్పింది. ఊరి నుంచి అందరూ వెళ్లిపోతుంటే బాధగా ఉండేదని చెప్పింది. రోడ్డు పనులు జరిగిన తర్వాత సమస్య ఉండదని.. ఊరి నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఇక.. జమ్మే కుటుంబ విషయానికి వస్తే.. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఊరి కోసం తన సొంతంగా దాచుకున్న డబ్బులు మొత్తాన్ని ఖర్చు చేసిన ఆమెకు అభినందనలు తెలియజేయాల్సిందే.

ఇలాంటి వారి చేతుల్లో అధికారం ఉంటే.. ఎంత బాగుండు? అన్న భావన కలుగక మానదు. పెద్దగా చదువుకోని జమ్మే.. అత్యుత్తమ చదువులు చదివిన వారి కళ్లను తెరిచేలా చేసిన ఆమె త్యాగానికి హేట్సాఫ్. ఆమె గురించి తెలిసిన వారందరికి చెప్పాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.