Begin typing your search above and press return to search.

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పై ప్రయాణం ఓ ఆనందమయం !

By:  Tupaki Desk   |   19 Oct 2020 9:50 AM GMT
కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పై  ప్రయాణం ఓ ఆనందమయం !
X
విజయవాడ వాసుల గత కొన్నేళ్ల కల నెరవేరింది. ట్రాఫిక్ కష్టాలతో నరకం చూస్తున్న బెజవాడ వాసులుకు ఇక నుండి ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తోన్న కనకదుర్గ ప్లైఓవర్ ప్రారంభమైంది. ఎట్టకేలకు విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లు ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు . ఈ వారధిని చూసేందుకు నగర వాసులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌ కి వెళ్లే మార్గం కావడంతో వాహనాలు ఆపి మరీ వారధి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు దసరా ఉత్సవాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది.

కనకదుర్గ వారధి విజయవాడకు మణిహారంగా ప్రజలు, పర్యాటకులతో కళకళలాడుతోంది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ వారధిపై ప్రయాణమంటే ఆ ఆనందమే వేరు. 500 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన‌ కనకదుర్గ వారధితో విజయవాడ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. 502 కోట్ల రూపాయలతో 6 వరుసలతో 2.6 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు .

ఇప్పటి వరకు ట్రాఫిక్‌ తో అష్టకష్టాలు పడిన నగరవాసులకి‌ ఈ వారధి నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుంది. . విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి రాజీవ్ గాంధి పార్క్ వద్ద ప్రారంభమయ్యే ఫ్లై ఓవర్ భవానీపురం వరకు 2.6 కిలోమీటర్ల వరకు సాగుతుంది. ఇంతటి అందమైన ఫ్లై ఓవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు స్ధానికులు కుటుంబాలతో సహా వారధి పైకి చేరుకుంటున్నారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ తెగ సంతోష పడుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే నదిపై నిర్మించిన‌ అతి పెద్ద ఫ్లై ఓవర్ ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ.. కృష్ణా తీరం అందాలను ఆస్వాదించే విధంగా రూపుదిద్దుకుంది. ఏదేమైనా ఈ వారధి పై ప్రయాణం అంటే ఆ ఆనందమే వేరు.