రేపటి వన్డే మన వైజాగ్ లోనే.. స్పెషాలిటీలేంటో తెలుసా..?

Sat Mar 18 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Tomorrow ODI will be in Vizag IND vs AUS

భారత్ -ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డే ఆదివారం విశాఖపట్టణంలో జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంటుంది. బావమరిది వివాహం కారణంగా తొలి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ విరామం తీసుకున్నాడు. అతడు రెండో వన్డేకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించినప్పుడు రోహిత్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడని రెండో మ్యాచ్ కు వస్తాడని పేర్కొన్నారు. దీనిప్రకారం కెప్టెన్ రేపటి మ్యాచ్ కు బరిలో దిగాలి. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు.ధోని దుమ్మురేపింది ఇక్కడే

అది 2005.. అప్పటికి మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు కొత్త. అతడి స్థానమూ జట్టులో పదిలం కాదు. అలాంటి సమయంలో మ్యాచ్. అదీ విశాఖపట్టణంలో. ఆ ఏడాది అక్టోబరు 31న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ధోనీ చెలరేగాడు. 145 బంతుల్లోనే 183 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు 10 సిక్స్ లున్నాయి. ఈ మ్యాచ తర్వాత ధోనీ వెనక్కుతిరిగి చూసుకోలేదు. కాగా ఈ స్టేడియం పేరు అప్పట్లో ఏసీఏ-వీడీసీఏ మైదానం. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ మరణం అనంతరం ఆయన పేరును పెట్టారు.

రోహిత్ వస్తే ఎవరిని తొలగిస్తారు..?

రెండో వన్డేకు రోహిత్ శర్మ వస్తే.. తొలి వన్డే ఆడిన వారిలో ఓ బ్యాట్స్ మన్ ను తొలగించాలి. అది ఎవరనేది చూడాలి. ఓపెనర్ ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ లలో ఒకరిని తప్పించాలి. కిషన్ డబుల్ సెంచరీ తర్వాత మరో మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. సూర్య వన్డేల్లో విఫలం అవుతున్నాడు. పరిస్థితి చూస్తుంటే సూర్యకు అవకాశం ఇచ్చి

కిషన్ ను తప్పించేలా కనిపిస్తోంది. ఇక తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ (75*) స్థానానికి ఢోకా లేదు. అతడు వికెట్ కీపర్ కూడా కావడం మేలు చేస్తోంది. మరోవైపు కిషన్ ప్రతిభావంతుడే అయినా.. మిడిలార్డర్ లో ఆడే సీనియర్ అయిన సూర్యకుమార్కు మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. బౌలింగ్ విభాగంలో మార్పులేమి ఉండకపోవచ్చు. అదనంగా మరొక బ్యాటర్ / స్పిన్నర్ను తీసుకోవాలంటే కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తీసుకుంటే ఉత్తమం. ఒకవేళ రోహిత్ అందుబాటులోకి రాకపోతే మాత్రం ఇదే జట్టుతో హార్దిక్ కొనసాగుతాడు. అప్పుడు వచ్చిన ఛాన్స్ను ఇషాన్ సద్వినియోగం చేసుకోకపోతే మరోసారి చోటు దక్కడం కష్టమే. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.