టిక్ టాక్ డేటా ఎక్కడుందో తెలుసా?

Sun Jul 05 2020 11:31:49 GMT+0530 (IST)

TikTok CEO Says It Has Not And Will Never Share Indian User Data

టిక్ టాక్.. టిక్ టాక్.. దేశాన్ని ఊపు ఊపేసింది ఈ వీడియో యాప్. దీని ద్వారా అందరి కళలు బయటపడ్డాయి. ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. ఎన్నో అరాచకాలు అక్రమ సంబంధాలకు ఈ యాప్ కారణమైంది. లాభం కంటే నష్టమే జనాలకు మిగిల్చింది. ఆ యాప్ మాత్రం కోట్లు కొల్లగొట్టింది.మంచి చెడూలు రెండు ఉన్న ఈ యాప్ ప్రస్తుతానికి చైనా దూకుడు కారణంగా భారత్ లో నిషేధానికి గురైంది. టిక్ టాక్ డేటా చైనా తరలిపోతోందని భారత్ నిషేధించింది. అయితే తాజాగా కేంద్రానికి టిక్ టాక్ డేటా భద్రమేనంటూ నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తాజాగా టిక్ టాక్ డేటా ఎక్కడ ఉంది.? చైనాకు పోతుందా లేదా అన్న విషయాలను ఆ యాప్ సీఈవో కెవిన్ మాయర్ వెల్లడించారు. టిక్ టాక్ లో సేవ్ అయిన డేటా ఇమ్మని చైనా దేశం మమ్మల్ని అడగలేదని.. అడిగినా మేము ఇచ్చేది లేదని.. ఈ డేటా అసలు చైనాలోనే లేదని సీఈవో కెవిన్ తెలిపారు. టిక్ టాక్ డేటా మొత్తం సింగపూర్ లోని సర్వర్లలో భద్రపరిచి ఉందని..అది కంపెనీ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.

భారతీయ డేటాను తాము ఎవరితోనూ పంచుకోలేదని సీఈవో కెవిన్ తెలిపారు. చైనాకు దూరంగా జరగాలని కూడా తాము నిర్ణయించుకున్నామని కెవిన్ తెలిపారు.

అయితే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మాత్రం ‘మా టిక్ టాక్ వాడకుండా భారతీయులు ఉండలేరని.. దమ్ముంటే ఉండండి’ అంటూ ఎగతాళి చేసింది..  ఈ నేపథ్యంలో టిక్ టాక్ చైనీస్ యాప్ అని అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలపై మాత్రం సీఈవో కెవిన్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.