వైసీపీ మూడ్ ని డిస్టర్బ్ చేస్తున్న మూడు రాజధానులు

Thu Mar 30 2023 06:00:02 GMT+0530 (India Standard Time)

Three capitals are disturbing YCP mood

మూడు రాజధానులు అని ఏ ముహూర్తాన అనుకున్నారో కానీ దానికి ఆది నుంచి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మూడు రాజధానులకు ప్రాతిపదిక అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది. అయితే జనాలకు మాత్రం ఇది కొత్త కాన్సెప్ట్. పైగా దేశంలోనూ అనేక రాష్ట్రాలలోనూ ఇప్పటిదాకా ఉన్నవి ఒక్క రాజధాని మాత్రమే. దాంతో పాటు ఈ కాన్స్పెప్ట్ ముందు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకే అర్ధం కానిదిగా మారింది.దానికంటే ముందు అమరావతి మీద  వైసీపీ  పూర్తి వ్యతిరేకత ప్రదర్శించడం వల్ల కూడా మూడు రాజధానులు తమ బాగుకోసం అని సబ్ రీజియన్స్ ప్రజలు నమ్మడానికి అవకాశం ఆస్కారం లేకుండా పోయింది. అమరావతిని శ్మశానంగా పోల్చిన మంత్రులు ఉన్నారు. అమరావతిలో అంతా దండగా ఏముంది అక్కడ అంటూ వెటకారం చేసే వారూ వైసీపీలో ఉన్నారు.

ఇలా ఒక పద్ధతి లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా తలకెత్తుకున్న మూడు రాజధానుల నినాదం విధానం లేని వ్యవహారంగా మారింది. మూడు రాజధానుల విషయంలో ప్లస్సులు ఏంటో ఎవరికీ తెలియవు. అదంతా ఊహాలోకాలు దేవతా వస్త్రాల టైప్ వ్యవహారంగానే ఉంది.

కానీ అమరావతి అనేది రియల్ గా ఉంది. చట్టపరంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదించింది. పైగా రైతులు ముప్పయి మూడు వేల ఎకరాలు భూమిని ఇవ్వడం అన్నది దేశంలోనే ఆకట్టుకునే అంశం. అందులోనే సెంటిమెంట్ కూడా ఎంతో నిండి ఉంది. దాంతోనే అమరావతి రాజధాని అంశం డామినేట్ చేస్తూ ముందుకు సాగింది.

అక్కడ రైతులు ఉన్నారా లేక కౌలుదారులు ఉన్నరా లేక బినామీలు ఉన్నారా అన్న దాని కంటే ముందు పచ్చి నిజం ఒకటి ఉంది అదేంటి అంటే వేలాది ఎకరాలను స్వచ్చందంగా ఇవ్వడం. ఇంతకంటే అతి పెద్ద విషయం వేరొకటి ఉంటుందని ఎవరూ అనుకోరు. నమ్మేది కూడా ఉండదు.

ఇక అమరావతి రాజధాని అన్నది కాగితాల మీద రాసుకుని చెరిపేసే రాత కోతా కాదు చట్టం గా మార్చుకునే అంశం కాదు వెనక ఎమోషన్ ఉంది. సెంటిమెంట్ ఉంది. రైతుల కన్నీరు ఉంది. వారితో ప్రభుత్వం ఒప్పందం ఉంది. దానిని స్మూత్ గా డీల్ చేసే విషయం లో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయింది అని అంటున్నారు.

అదెలా అంటే మొదటి నుంచి అమరావతి రాజధాని  పట్ల పూర్తి వ్యతిరేకతతోనే వైసీపీ ఏలికలు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు ఏమీ మాట్లాడకుండా గుంభనంగా ఉంటూ ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు రేకెత్తించి సడెన్ గా మూడు రాజధానుల స్లోగన్ అందుకున్నారు. దాంతో ఏపీలోని మిగిలిన రెండు ప్రాంతాలు తమకు రాజధానులు వచ్చాయని పొంగిపోలేదు కానీ అమరావతి రైతులు బరస్ట్ కావడం ఉద్యమం ఊపు అందుకోవడంతో ఆ సెంటిమెంత్ కి ఏపీ మొత్తం పడిపోయింది.

వాటి కంటే ముందు ఏపీకి అసలు రాజధాని లేకుండా చేశారు అన్న బాధ అవేదన ప్రతీ ఆంధ్రులలో ఉండడం వల్ల మూడు రాజధానులకు ఏ మాత్రం మద్దతు దక్కలేదు. విభజనతో  కునారిల్లిన ఏపీకి ఎప్పటికైనా దశ తిరుగుతుంది అనుకుంటే అమరావతిని కూడా లేకుండా చేసేందుకే మూడు రాజధానులు అని అంటున్నారన్న విషయం జనాల్లోకి వెళ్ళిపోయింది.

ఇక అనేక కీలక అంశాలను టెక్నికల్ ఇష్యూస్ ని ప్రభుత్వం దారుణంగా విస్మరించింది. మొత్తానికి అంతా హడావుడి అమరావతి రాజధానిని దాని ఉద్యమాన్ని తేలికగా తీసుకుని చేసిన దూకుడు నేల విడిచి చేసిన సాము మంత్రులు ఎమ్మెల్యేల అనుచిత కామెంట్స్ అన్నీ కలసి ఏపీ జనాలకు కూడా మూడు రాజధానుల మీద రోత పుట్టేలా చేశాయి. ఇక హై కోర్టులో సైతం ప్రభుత్వం సరైన వాదనలు వినిపించుకోలేకపోయిందని అంటారు. ఫలితంగా అక్కడ వ్యతిరేక తీర్పు వచ్చింది.

అది జరిగిన ఆరు నెలల తరువాత తాపీగా సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇపుడు చూస్తే అక్కడ తొందరగా తమకు తీర్పు రావాలీ కావాలీ అంటున్నారు. అయితే తాజా విచారణ తరువాత సుప్రీం కోర్టు జూలై 11కి వాయిదా వేసింది. మరి ఆ నాటికి విచారణ మొదలైనా  ఎన్ని వాయిదాలు పడతాయో ఎంతకాలం ఈ విచారణ సాగుతుందో ఎవరికీ తెలియదు.

మొత్తానికి ఎన్నికల ఏడాది వచ్చేసింది. మూడు రాజధానుల మీద ఏ విధంగా సాగాలీ అన్న దాని మీద వైసీపీకి ఏమీ పాలుపోవడంలేదు. టోటల్ గా వైసీపీ మూడ్ ని మూడు రాజధానులు డిస్టర్బ్ చేస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులను  అంశగా చేసుకుందామన్నా ఇపుడు కుదురుతుందా అన్నదీ చూడాలని అంటున్నారు. మూడు రాజధానులు అన్నది ఎత్తుకుని చివరికి రేపటి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందా అన్న కలవరం అయితే పెద్దలలో ఉందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.