Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎమ్మెల్యేలు రాజీనామాకు సై.. కేవలం అంతమందేనా?

By:  Tupaki Desk   |   4 Aug 2020 6:30 AM GMT
చంద్రబాబు ఎమ్మెల్యేలు రాజీనామాకు సై.. కేవలం అంతమందేనా?
X
‘దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. ఎన్నికలకు వెళదాం.. అమరావతి రాజధానిపై ప్రజల్లోనే తేల్చుకుందాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తొడగొట్టేశాడు. కానీ పదేళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాదికే చంద్రబాబు ఆవేశానికి తలొగ్గి అధికారాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకుంటుందని ఊహించలేం.

నిజానికి ఏడాదికే ఎన్నికలకు వెళ్లడం టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం లేదు. కోట్లు ఖర్చు పెట్టి ఏడాది తిరగకముందే మళ్లీ ఎన్నికలకు వెళ్లేంత సాహసం ఎవరికీ లేదు. చంద్రబాబు కూడా గెలుస్తాడో లేదో అన్నట్టుగానే పరిస్థితి ఉంది. జగన్ ఏడాదిలోనే సంక్షేమ జల్లు కురిపించడంతో మొగ్గు కాస్త ఇటువైపే ఉందంటారు.

48 గంటల్లో జగన్ కు టైం ఇచ్చి చంద్రబాబు తప్పు చేశాడు అని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మాతో కనీసం మాట్లాడకుండా బాబు ప్రకటన చేస్తే మా లోకల్ పరిస్థితి చూసుకోకుండా.. గెలుపోటములు అంచనావేయకుండా మేము ఎలా రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే ఒకతను ఆఫ్ ది రికార్డ్ వాపోయాడంట. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే చంద్రబాబుకు మద్దతుగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారట.. మరో 15 మంది ఇప్పటికిప్పుడు బాబు ఆదేశానుసారం రాజీనామా చేయడానికి అస్సలు సిద్ధంగా లేరట.. దీంతో బాబు ఎంతో వీరావేశంతో తొడగొట్టిన ఆయన నాయకత్వాన్ని నమ్మి రాజీనామాలు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేల్లోనే ఐక్యత లేదని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

చంద్రబాబు వెంట పట్టుమని కేవలం ఐదుగురు మాత్రమే ఎమ్మెల్యేలుండడం టీడీపీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. జగన్ తో ఢీకొట్టే ముందు కనీసం చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కానీ చంద్రబాబు చెప్పగానే జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోయేంత సాహసం చేయబోడని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.