Begin typing your search above and press return to search.

వేలాది ‘భర్తల్ని’ అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఆ రాష్ట్ర సీఎం

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 AM GMT
వేలాది ‘భర్తల్ని’ అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఆ రాష్ట్ర సీఎం
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అసోం ముఖ్యమంత్రి హిమాంశు బిశ్వశర్మ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. తాను ఎంత చెప్పినప్పటికీ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆగట్లేదని.. అందుకే.. బాల్య వివాహాలు చేసుకునే వారిని అరెస్టు చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు.. బాల్య వివాహాలు చేసుకునే వారికి యావజ్జీవ కారాగార వాసం పడేలా చేస్తామని చెబుతున్నారు.

పద్నాలుగేళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ కారాగార వాసం విధిస్తామని స్పష్టం చేశారు. రానున్న ఐదారు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలికలను పెళ్లి చేసుకున్న వేలాది మంది భర్తల్ని అరెస్టు చేస్తామని చేసిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. సరైన వయసులోనే అమ్మతనాన్ని పొందాలని.. నిర్ణీత వయసు కంటే ముందు పిల్లలు పుట్టినా.. ఆలస్యంగా పిల్లలు పుట్టినా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ఆయన.. 20-30 ఏళ్ల మధ్యలో పిల్లల్ని కనటం ఉత్తమంగా అభివర్ణించారు.

సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నా.. పద్నాలుగేళ్లలోపు బాలికలపై లైంగిక చర్యలుకు పాల్పడితే మాత్రం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చెప్పిన ఆయన.. ఇందుకు సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ షురూ చేశారు. 14 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లు కేబినెట్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఒక అధికారిక నివేదిక ప్రకారం చూసినప్పుడు అసోంలో జరిగే పెళ్లిళ్లలో 31 శాతం పెళ్లిళ్లు బాల్యవివాహాలే కావటం.. వాటికి చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్ర సీఎం తీసుకున్న నిర్ణయం చిన్నారులకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు. మరి.. ఈ నిర్ణయంతో హిమాంశు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.