Begin typing your search above and press return to search.

మీరు కలలో కూడా ఊహించని బిజినెస్ అక్కడ జోరుగా సాగుతోంది?

By:  Tupaki Desk   |   9 Jun 2021 11:30 PM GMT
మీరు కలలో కూడా ఊహించని బిజినెస్ అక్కడ జోరుగా సాగుతోంది?
X
వ్యాపారం చేయాలని డిసైడ్ కావాలే కానీ.. అందుకు ఉండే అవకాశాలు కోకొల్లలు. కొందరి తెలివి చూస్తే.. మట్టి నుంచి కూడా నూనెను తీసే టాలెంట్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా అలాంటిదే. జపాన్ లో ఇప్పుడో కొత్త వ్యాపారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఆ దేశంలో బొద్దుగా ఉండే వారిని అద్దెకు ఇచ్చే బిజినెస్ ఇప్పుడు బాగా సాగుతుంది. ఇంతకూ లావుగా ఉన్న వారిని అద్దెకు ఎందుకు తీసుకుంటారు? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఈ వ్యాపారం చేస్తున్న పెద్ద మనిషిని ఇదే ప్రశ్నను సంధిస్తే.. ఆయన చెప్పే విషయాలు వింటే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.

మిగిలిన దేశాల్ని పక్కన పెడితే జపాన్ లో లావుగా ఉండేవారు.. బొద్దుగా కనిపించే వారు తక్కువగా ఉంటారు. ఎక్కడ ఏది తక్కువగా ఉంటుందో.. దాంతో వ్యాపారం చేస్తే లాభాలు వచ్చేయటం ఖాయం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తుంది సదరు సంస్థ. లావుగా ఉన్న వారిని అద్దెకు ఇస్తామని ప్రకటించింది డెబుకారి సంస్థ. ఇందుకు గంటకు మన రూపాయిల్లో రూ.1333 చెల్లించాలని పేర్కొంది. డెబుకారి సంస్థ అధినేత బ్లిజ్. ఇతడీ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ముందు.. బొద్దుగా ఉండే వారికి అవసరమైన దుస్తుల కోసం క్యూజిల్లా అనే బ్రాండ్ ను పెట్టాడు.

అయితే.. తన బ్రాండ్ ను ప్రచారం చేసుకోవటానికి అవసరమైన ప్లస్ సైజు వారు ఒక పట్టాన దొరికే వారు కాదు. దీంతో.. అతడి మెదడు పాదరసంలా పని చేసి.. లావుగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వటం షురూ చేశారు. అలా ఇప్పటికి 45 మందిని తన కంపెనీలో చేర్చుకున్నాడు. ప్లస్ సైజు వారిని అద్దెకు తీసుకొని ఏం చేసుకుంటారన్న సందేహాన్ని అడిగితే.. పిచ్చివాడా.. అన్నట్లు ఒక చూపు చూసి తనకున్న వ్యాపార అవకాశాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పటం మొదలుపెడతాడు.

తమ బ్రాండ్ దుస్తుల్ని ట్రై చేసుకోవటానికి.. తాను అద్దెకు ఇచ్చే వారిని ఉపయోగించుకోవచ్చని.. వారు ఆ దుస్తుల్ని ధరించిన తర్వాత ఎలా ఉంటారన్న విషయం వారికే అర్థమవుతుందని చెబుతాడు.
అంతేకాదు.. బొద్దుగా ఉండే వారు.. తమకు మించిన ప్లస్ సైజులో ఉన్న వారు పక్కన ఉంటే.. తాము సన్నగా కనిపించటాన్నిఎంజాయ్ చేస్తారని అతడు చెబుతున్నాడు. 18 ఏళ్లకు పైబడిన అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ తానుజాబ్ ఇస్తానని చెబుతున్నాడు. అంతేకాదు.. ప్లస్ దుస్తులతో పాటు.. ప్లస్ వారి కోసం ఉత్పత్తులు తయారు చేసే వారు సైతం.. తమ ప్రచార ఉత్పత్తుల్ని ప్రచారం చేయటానికి మనుషులు అవసరమవుతారని.. అలాంటి కంపెనీలకు తమ ఉద్యోగుల్ని గంటల చొప్పున పంపుతానని చెబుతున్నాడు. వ్యక్తులు ఎవరైనా బొద్దుగా ఉన్న వారిని అద్దెకు తీసుకుంటే.. వారికి ఇచ్చే అద్దె డబ్బుల్ని వారికే ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇలా తన వ్యాపారం బాగానే సాగుతున్నట్లుగా చెబుతున్నాడు. వినేందుకే విచిత్రంగా ఉంది కదా ఈ బిజినెస్. జపానా మజాకానా?