Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఆ పార్టీల‌ షాక్‌!

By:  Tupaki Desk   |   26 Sep 2022 4:53 AM GMT
కేసీఆర్ కు ఆ పార్టీల‌ షాక్‌!
X
వ‌చ్చే 2024 పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కోవ‌డానికి ప్రతిప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఆయా పార్టీలు షాక్ ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ ర‌హిత కూట‌మికి కేసీఆర్ ప్రాధాన్య‌త ఇస్తూ ఎక్కే గ‌డ‌ప‌.. దిగే గ‌డ‌ప అన్న‌ట్టు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను, ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌ను కలుస్తూ కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ప్ర‌ధాన విప‌క్ష పార్టీలు కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాయి.

కాంగ్రెస్ పార్టీని కలుపుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్తామ‌ని తేల్చిచెప్పాయి. ఈ మేర‌కు హ‌రియాణాలో ఇండియ‌న్ లోక్ ద‌ళ్ (ఐఎల్‌డీ) అధినేత ఓం ప్ర‌కాష్ చౌతాలా నిర్వ‌హించిన ప్ర‌తిప‌క్షాల స‌మావేశానికి బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు, బిహార్ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వీ యాద‌వ్, మాజీ సీఎం, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్, సీపీఎం జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని కూడా క‌లుపుకుని ముందుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు నితీష్ కుమార్, లాలూప్ర‌సాద్ యాద‌వ్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీని క‌లిశారు. ప్ర‌స్తుతం ఈ మూడు పార్టీల కూట‌మి (జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్) బిహార్ లో అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోనియాను క‌లిసిన నితీష్, లాలూ వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై ఆమెతో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో విప‌క్షాల‌న్నీ క‌లిసి పోటీ చేయ‌డానికి తాము ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని ఆమెకు ఈ ఇద్ద‌రు నేత‌లు చెప్పిన‌ట్టు స‌మాచారం.

అదేవిధంగా కాంగ్రెస్‌తో క‌లిసి న‌డ‌వ‌డానికి ఎన్సీపీ అధినేత‌, ఐఎల్‌డీ అధినేత ఓంప్ర‌కాష్ చౌతాలా, క‌మ్యూనిస్టు పార్టీల‌తో స‌హా త‌దిత‌ర పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ అట‌క ఎక్కిన‌ట్టే. నితీష్, లాలూ, శ‌ర‌ద్ ప‌వార్ వంటి పెద్ద నేత‌లే కాంగ్రెస్ తో క‌ల‌సి న‌డ‌వ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ త‌దిత‌రులు సైతం కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌ల‌సి న‌డ‌వ‌డానికి త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌న్నింటిని ఏకం చేయ‌డం, కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకిస్తున్న కొన్ని పార్టీల‌ను సైతం కాంగ్రెస్ కూట‌మిలో చేరేలా చేయ‌డం వంటి అంశాల‌పై సోనియాగాంధీతో నితీష్, లాలూప్ర‌సాద్ యాద‌వ్ మంత‌నాలు జ‌రిపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు ప్ర‌తిప‌క్ష నేత‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ఒప్పించ‌నున్నార‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో థర్డ్ ఫ్రంట్ ఏమీ లేదని.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి అన్ని పార్టీలను కలుపుకుపోతామని భేటీ అనంతరం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్‌ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీని, బిజూ జ‌న‌తాద‌ళ్‌, క‌శ్మీర్‌లో పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీని, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీని క‌ల‌వాల‌ని చూస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.