Begin typing your search above and press return to search.

ఈసారీ ఆరున్నర గంటలు తప్పలేదు.. అంతసేపు ఏం మాట్లాడతారు?

By:  Tupaki Desk   |   20 Jun 2021 9:50 AM GMT
ఈసారీ ఆరున్నర గంటలు తప్పలేదు.. అంతసేపు ఏం మాట్లాడతారు?
X
దేశంలో మరే రాష్ట్రంలో జరగనన్ని సిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనేం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? అన్న విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించాల్సి రావటంతో ప్రతి పది రోజులకోసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది కానీ మూమూలుగా అయితే కేబినెట్ భేటీ అన్నది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు.

గడిచిన నెల రోజుల్లో పది రోజులకు ఒకసారి చొప్పున జరిగిన మంత్రివర్గ సమావేశం.. తక్కువలో తక్కువ ఆరు గంటల నుంచి తొమ్మిదిగంటల వరకు సాగటం తెలిసిందే. గత సమావేశం అయితే ఏకంగా తొమ్మిదిన్నర గంటల పాటు సాగి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యాహ్నం మొదలైన భేటీ అర్థరాత్రికి కాస్త ముందు ముగియటం విశేషం. వీరి సమావేశం సాగుతున్నంతసేపు పెద్ద ఎత్తున అధికారులు.. సిబ్బంది అంతా వెయిట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినా.. అలాంటివేమీ కేసీఆర్ కు పట్టవనుకోండి.

సాధారణంగా మంత్రివర్గ సమావేశం గంట నుంచి రెండు గంటల పాటు సాగుతుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే మరికాస్త ఎక్కువ సేపు సాగుతుంది. అంతే తప్పించి.. ఆరేడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది ఇంతకీ.. కేబినెట్ భేటీలో ఏం జరుగుతుంది? అంతసేపు ఏం మాట్లాడుకుంటారన్న సందేహం కలుగక మానదు.

ఎజెండా ప్రకారం విషయాల చర్చకు వచ్చినప్పటికి.. మధ్యలో టాపిక్ డైవర్ట్ కావటం.. దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తన అనుభవాలు.. తనకు తెలిసిన విషయాలు.. అవగాహన ఉన్న అంశాల్ని వివరించటం లాంటి వాటితో ఎక్కువ సమయం దానికే సరిపోతుందని చెబుతారు. మధ్యలో ఎవరూ కల్పించుకునే పరిస్థితి ఉండదని.. అందరిది ప్రేక్షక పాత్రేనని చెబుతారు. అయితే.. కేసీఆర్ మాట్లాడినంతసేపు ఆసక్తికరంగా ఉండటంతో బోర్ కొట్టే అవకాశం ఉండదని చెబుతారు. తాజాగా లాక్ డౌన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రివర్గసమావేశాలు ఎప్పటి మాదిరి నిర్వహిస్తారా? లేక పాత పద్దతిలో ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.