Begin typing your search above and press return to search.

మానవత్వం అంటే ఇదేనేమో ... డ్రైవర్‌గా మారిన డాక్టర్ ..ఎందుకంటే !

By:  Tupaki Desk   |   13 July 2020 11:50 AM GMT
మానవత్వం అంటే ఇదేనేమో ...  డ్రైవర్‌గా మారిన డాక్టర్ ..ఎందుకంటే !
X
ఆయన ఎదో సాదా సీదా ఉద్యోగి కాదు, జిల్లా సర్వే లెన్స్ అధికారి. అనుకుంటే కూర్చున్న చోటు నుండి జిల్లాలో ఎక్కడైనా ఏ పనినైనా చేయించగలరు. కానీ ,ఆ అధికారాల్ని పక్కన పెట్టి ..ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా సర్వే లెన్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ ట్రాక్టర్ డ్రైవర్ గా మారి ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని నిరూపించారు. అసలు విషయం ఏమిటి అంటే .. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది.

దీనితో మృతదేహాన్ని అక్కడి నుండి తరలించడానికి ఆస్పత్రి అధికారులు మున్సిపల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఆ తరువాత మున్సిపాలిటీకి చెందిన చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌ ను డ్రైవర్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు ముందుకు తెచ్చి అక్కడే వదిలి వెళ్లిపోయాడు. దీనితో ఆ మృతదేహాన్ని ఎలా తరలించాలని ఆలోచిస్తున్న క్రమంలో జిల్లా సర్వేలెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రీరాం పీపీఈ కిట్ వేసుకుని ట్రాక్టర్‌కి డ్రైవర్ గా మారి స్మశాన వాటిక వరకూ ఆ మృతదేహాన్ని తరలించి , అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఎవరూ ఊహించని విధంగా డాక్టర్ శ్రీరాం ట్రాక్టర్ నడపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. డాక్టర్గా ఆయన చూపిన మానవత్వానికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.