Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ జెట్ స్పీడ్ వ్యాప్తికి కారణం ఇదే..!

By:  Tupaki Desk   |   27 Jan 2022 1:30 AM GMT
ఒమిక్రాన్ జెట్ స్పీడ్ వ్యాప్తికి కారణం ఇదే..!
X
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇటీవల వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మనదేశంలోనే కాకుండా అమెరికా, ఆఫ్రికా, యూరప్ కంట్రీల్లోనూ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే దీనికి కారణం దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్. ఈ కొత్త వేరియంట్ కు జెట్ స్పీడ్ లో వ్యాప్తి చెందే గుణం ఉందనే విషయం తెలిసిందే. ప్రమాద తీవ్రత తక్కువ ఉన్నా కూడా... ఎక్కువ మందికి సోకుతుందని వైద్యనిపుణులు ఇప్పటికే చెప్పారు. అయితే ఈ వేరియంట్ పై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ పరిశోధకుల అధ్యయనాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అసలు ఒమిక్రాన్ ఇంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో తెలిసింది.

క్యూటో యూనిర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ పై పలు పరిశోధనలు జరిపారు. అయితే మనిషి చర్మంపై ఈ కొత్త వేరియంట్ దాదాపు 21 గంటల పాటు యాక్టివ్ గా ఉందని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ప్లాస్టిక్ మీద ఏకంగా 8 రోజుల పాటు సజీవంగా ఉంటుందట. గత ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ ఎక్కువ సేపు సజీవంగా ఉంటుంది. అందుకే
ఒకరి నుంచి మరొకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు వెల్లడించారు. కరోనా తొలి వేరియంట్ సీవోవీ 2 కంటే ఆ తర్వాత ఉద్బవించిన వేరియంట్లు చాలా ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు.

కరోనా తొలి వేరియంట్ మానవ శరీరంపై 8.6 గంటల పాటు సజీవంగా ఉండేది. ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు కాగా.. డెల్టా రకం 21.1 గంటల పాటు యాక్టివ్ గా ఉండేది. ప్లాస్టిక్ పై డెల్టా 114 గంటలపాటు ఉండేది. అయితే ఒమిక్రాన్ మాత్రం చాలా ఎక్కువ సమయంపాటు చురుగ్గా ఉంటోందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్ పై ఈ కొత్త వేరియంట్ దాదాపు 193.5 గంటలు ఉంటోందని గుర్తించారు. ఈ కారణంగానే గత వేరియంట్లతో పోల్చితే... ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జనవరి 17 నుంచి జనవరి 23 వరకు వైరస్ బాధితుల సంఖ్య అమాంతంగా పెరిగినట్లుగా నివేదికల్లో స్పష్టమైంది. ఆ వారం రోజుల వ్యవధిలో ఏకంగా రెండు కోట్లకు పైగా మందికి వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.

దేశంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అయితే మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. రికవరీ శాతం పెరుగుతోందని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. అర్బన్, రూరల్ ఏరియాల్లో టీకా పంపిణీ శరవేగంగా సాగుతోంది. ప్రపంచ దేశాలు జనాభాతో పోల్చితే భారత దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చాలా మెరుగ్గా ఉంది.