వైసీపీ ఎంపీ విందు రాజకీయం.. మతలబేంటి?

Sun Dec 15 2019 15:45:11 GMT+0530 (IST)

This Is How YSRCP Is Checkmating Its Own MP Raghuramakrishnam Raju

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుఫున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీలోని లాన్స్ వెస్టర్న్ కోర్టులో ఎంపీలకు భారీ విందు ఇచ్చిన రఘురామ కృష్ణం రాజు వైసీపీలో గుబులు రేపారు. ఈ విందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు.రఘురామకృష్ణం రాజు నోరూరించే తెలుగు వంటకాలు వెయ్యి రూపాయల స్పెషల్ పాన్ ఖరీదైన వంటలు ఏర్పాటు చేసి లక్షలు ఖర్చు చేసిన ఇచ్చిన ఈ విందు వెనుక వేరే రాజకీయం ఉందని వైసీపీ అధిష్టానం అనుమానిస్తోందట.. ఈ విందుకు వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాకపోవడంతో దీనిపై వైసీపీ సీనియర్ గా ఉందనే ప్రచారం సాగుతోంది.

గతంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన రఘురామకృష్ణం రాజు వైసీపీ ఎంపీగా గెలిచాక కమలం పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మరింత దగ్గరవుతున్నారు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఇంగ్లీష్ మీడియంపై జగన్ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక జగన్ విజయసాయిరెడ్డి హెచ్చరించినా మోడీ అమిత్ షా సహా కేంద్రమంత్రులను కలుస్తూ వంగివంగి దండాలు పెడుతూ వైసీపీలో కాకరేపుతున్నారు.

రఘురామకృష్ణం రాజు తన వ్యవహారశైలితో  సస్పెండ్ చేయించుకొని బీజేపీలోకి వెళ్లాలని వ్యూహం పన్నాడని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.  తనకు తానుగా ఫిరాయించే కంటే వైసీపీ సస్పెండ్ చేస్తే బీజేపీలో చేరిపోవచ్చని రఘురామకృష్ణం రాజు ప్లాన్ చేశారట.. బీజేపీలో చేరితే ఢిల్లీలో పనులు చేసుకోవచ్చు.. పలు కాంట్రాక్టులు చేపట్టవచ్చనే ఆలోచనతోనే బీజేపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడని వైసీపీ అధిష్టానం అనుమానిస్తోంది.

అయితే రఘురామకృష్ణం రాజు ప్లాన్ తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసి తమ చేతికి మట్టి అంటించుకోకుండా ఆయనకు సెగ పెట్టే ప్రయత్నాలను చేసింది. నర్సాపురంలో ఆయన ప్రత్యర్థులైన గోకరాజు గంగరాజు ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకొని షాకిచ్చింది. ఇలా విందు రాజకీయంతో బీజేపీకి చేరువ అవుదామని రాజకీయాలు చేస్తున్న రఘురామకు సొంత ఇంటిలో పొగబెట్టి వైసీపీ ఉక్కిరిబిక్కిరి చేసింది. మరి రఘురామ సొంతంగానే బీజేపీలో చేరుతారా.? ఇలానే రాజకీయం చేస్తాడా అన్నది వేచిచూడాలి.