కరోనా వార్డులో దొంగలు.. ఏం కొట్టేశారో తెలుసా?

Sun Apr 18 2021 20:00:01 GMT+0530 (IST)

Thieves in Corona ward  Do you know what happened

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక సరిపడా ఔషధాలు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పడ్డారు. ఏ సమయంలో జరిగిందో తెలియదుగానీ.. అతి కీలకమైన ఔషధాలను భారీ సంఖ్యలో ఎత్తుకెళ్లారు.కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాధిగ్రస్తులకు ఇచ్చే రెమ్ డెసివిర్ ఇంజక్షన్లకు భారీస్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా 860 ఇంజక్షన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.

మధ్యప్రదేశ్ లో కొవిడ్ కేసులు తారస్థాయికి చేరడంతో రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లో ఏకంగా 11045 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గడిచిన నెల రోజుల్లోనే దాదాపు 90 వేల మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో.. కరోనా కట్టడి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు భారీసంఖ్యలో చోరీకి గురికావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వస్ సారంగ్ మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్నారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే.. ఇదంతా సిబ్బందికి తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.