Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ చోరీకి వెళ్లి గర్భిణికి కత్తి గురి పెట్టి వైన్ తాగిన దొంగోడు దొరికాడు

By:  Tupaki Desk   |   28 May 2023 1:00 PM GMT
అర్థరాత్రి వేళ చోరీకి వెళ్లి గర్భిణికి కత్తి గురి పెట్టి వైన్ తాగిన దొంగోడు దొరికాడు
X
పెను సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ చోరీ చేసిన ఘరానా దొంగ దొరికేశాడు. టిప్పు టాప్ గా రెఢీ అయి.. జూబ్లీహిల్స్ లోని ఒక భారీ భవనంలోకి ప్రవేశించి.. గర్భిణికి కత్తిని గురి పెట్టి.. గంటల పాటు ఆమె బెడ్రూంలో ఉండటం.. ఆ సందర్భంగా వైన్ తాగటం తెలిసిందే. అనంతరం ఆమె కుటుంబ సభ్యుల్ని బెదిరించి రూ.10లక్షల భారీ మొత్తాన్ని తీసుకొని వెళ్లిపోవటం తెలిసిందే. వెళ్లే క్రమంలో బాధితురాలు నవ్య సెల్ ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయించుకొని మరీ వెళ్లిన వైనం పోలీసు అధికారులకు సైతం షాకింగ్ గా మారింది.

అర్థరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించి.. ఆరు గంటల పాటు ఉండి.. డిమాండ్ చేసిన క్యాష్ చేతికి చిక్కినంతనే క్యాబ్ బుక్ చేసుకెళ్లిన అతడు.. షాద్ నగర్ లో దిగటం.. అక్కడ షాపింగ్ చేస్తూ సీసీ కెమేరాలకు దొరికాడు. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగా చోరీకి పాల్పడిన బాధితురాలి ఇంటిని పరిశీలించగా.. వేలి ముద్రలు కూడా లభించలేదు. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. షాద్ నగర్ లో షాపింగ్ చేసిన తర్వాత నుంచి అతడు ఎక్కడికి వెళ్లి ఉంటాడన్న విషయం మీద ఆరా తీసి అతడి ఆచూకీని పట్టుకున్నారు.

చివరకు ఈ ఘరానా దొంగ పేరు రాజేశ్ యాదవ్ గా గుర్తించారు. అప్పుల బాధ ఎక్కువ కావటంతో చోరీ చేసి ఆ అప్పుల్ని తీర్చాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ వెల్లి.. అక్కడున్న ఇళ్లను పరిశీలించాడు. గోడలు ఎత్తుగా ఉండి.. కాపలాదారులు ఎక్కువగా ఉండటంతో.. తక్కువ ఎత్తు ఉన్న ఎన్ఎన్ ఎన్ రాజు ఇంటిని టార్గెట్ చేశాడు. నిచ్చెన సాయంతో ఇంట్లోకి ప్రవేశించిన అతను.. రాజు కుమార్తె నవ్యవ మెడకు కత్తి పెట్టి నగదు కావాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ.10లక్షల నగదుతో ఓలా బుక్ చేసుకొని షాద్ నగర్ లో దిగాడు. అక్కడ గంటన్నర పాటు షాపింగ్ చేసి.. డ్రెస్ మార్చుకున్న అతడు..పోలీసుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటారన్న భావన కలిగేలా చేశాడు.అయితే.. పోలీసులు అతను స్థానికంగా ఉంటాడన్న కోణంలో విచారణ చేపట్టారు.

వారి అంచనాలకు తగ్గట్లే.. ఇతడు షాద్ నగర్ నుంచి మరో క్యాబ్ లో రాంగోపాల్ పేటలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈసారి తన ఫోన్ ను ఉపయోగించాడు. ఈ పాయింట్ ఆధారంగాతీగ లాగగా.. దొంగ దొరికాడు. తాను చోరీ చేసిన రూ.10 లక్షల్లో రూ.2.5 లక్షలు పెట్టి రాయల్ ఎన్ ఫీల్డ్ ను కొనుగోలు చేసిన అతడు.. మరికొంత నగదును ఖర్చు చేశాడు. అతని నుంచి కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా గుర్తించారు.