సంకెళ్లతో తమను తాము బంధించుకున్నారు.. ఇదో రకం ప్రేమ మరి!

Mon Mar 01 2021 18:00:01 GMT+0530 (IST)

They bound themselves with chains

ప్రేమ బంధం శాశ్వతమైంది. ప్రేమను ఎవరూ విడదీయలేరు. ఇవన్నీ ప్రేమ పక్షులు చెప్పుకొనే మాటలు. కానీ ఓ జంట మాత్రం తమ ప్రేమను ఎవరూ విడదీయకూడదనుకున్నారు. ఇందుకోసం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతుల్లోకి దిగారు. ఇందుకోసం ఆ ప్రేమ జంట ఏకంగా సంకెళ్లతో తమను తాము బంధించుకున్నారు. మూడు నెలల పాటు అలాగే సంకెళ్లతో బంధించుకొని ఉండిపోయారు. చివరకు ఆ యువతికి చేతికి గాయాలు కావడంతో వీళ్ల సంకెళ్ల బంధానికి తెరపడింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..ఉక్రెయిన్లో అలెగ్జాండర్ పుస్తోవిటావా అనే ప్రేమజంట తమ ప్రేమ ఎంత పెనవేసుకుపోయిందో లోకానికి చాటి చెప్పాలని భావించారు. ఇందుకోసం ఇద్దరూ తమ చేతులకు సంకెళ్లు వేసుకున్నారు. దాదాపు మూడునెలల పాటు ఇలాగే ఉండిపోయారు. వాళ్ల వ్యక్తిగత పనులు ఇలాగే చేసుకున్నారు. అయితే ఆ సంకెళ్ల రాపిడితో చివరకు యువతి చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించగా.. వెంటనే సంకెళ్లు తీయాలని చెప్పారు. దీంతో సంకెళ్లు తీసేశారు. యువతి యువకులు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో కొందరు ప్రేమజంటలు రెచ్చిపోతున్నారు. ఎత్తైన కొండలమీదకు వెళ్లి సెల్ఫీలు దిగడం.. సాహసయాత్రలు చేయడం లాంటి చర్యలు చేస్తున్నారు. అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి సాహసకృత్యాలు సరికాదని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రేమ పేరుతో పిచ్చి ప్రయోగాలు చేస్తే.. ప్రాణాలు కోల్పోయో పరస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.