వైసీపీలో వారు నోరు విప్పడం లేదు

Tue May 24 2022 13:01:43 GMT+0530 (India Standard Time)

They Are Not Opening Mouths in YCP

వైసీపీలో ఒక బీభత్సమైన సైలెన్స్ నెలకొని ఉంది. అనంతబాబు దళితుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా మారి తప్పును అంగీకరించిన తర్వాత కూడా ఆ సైలెన్స్ వీడటం లేదు. అసలేమీ జరగనట్టు  మాజీ హోం మంత్రి దళిత నేత ప్రవర్తిస్తున్నారు. జూపుడి ప్రభాకర్  లాంటి వారు ఎక్కడున్నారో తెలియదు. పోనీ మంద కృష్ణ మాదిగ లాంటి లీడర్లు మాట్లాడినా బాగుండేది. అంటే ఆ గొడవ ముగిసిందా అన్నది అనంత బాబు విషయమై వినిపిస్తున్న వాదన.తప్పో ఒప్పో బీసీ సంక్షేమం చూస్తున్న ఎస్సీ నేత మేరుగ నాగార్జున అనే మంత్రి మాత్రమే స్పందించారు. ధైర్యం చేసి ఇదొక హత్య అని ప్రకటించి శ్రీకాకుళం పర్యటనలో సంచలనం రేపారు. ఆ పాటి కూడా మంత్రులు ఎవ్వరూ మాట్లాడకపోవడం శోచనీయం. అంటే క్యాబినెట్ కులాల వారీగా విడిపోయి ఈ విషయాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని యోచిస్తుందా అన్న సందేహం కూడా ప్రజా సంఘాల నుంచి వినవస్తోంది.

ఎమ్మెల్సీ కేసు ఇప్పుడు ఎటు పోతుందో అన్నది అటుంచితే ఈ కథలో  మరో కీలక ప్రశ్న ఏంటంటే .. మాజీ దళిత హోం మంత్రి ఎందుకని స్పందించలేదు అన్నదే పెద్ద ప్రశ్న. నిన్నటి వేళ తన ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తం అయి తన సమయం కేటాయించారే కానీ అనంత బాబు ఇష్యూ  పై మాట్లాడ లేదు.

ఆఖరికి తోటి దళితుడు చనిపోయాక కూడా మాజీ మంత్రి స్పందించరా అన్న విమర్శ ఒకటి సంబంధిత సంఘాల నుంచి వస్తున్నాయి. కేవలం పాపం డ్రైవర్  కు తాగుడు మాన్పించేందుకే ప్రయత్నించి విఫలం అయి విచక్షణా రహితంగా కొట్టేశారు. ఇసుకలో తలను నెట్టి మరీ కొట్టేశారా? ఆహా ఏం చెబుతున్నారో కదూ అని విస్తుబోతోంది పసుపు పార్టీ వర్గం.

ఇక పోలీసులు కూడా నిన్నంతా డ్రామా నడిపారు. శనివారం రాత్రే అరెస్టు అంటూ ఏలూరు రేంజ్ డీఐజీ మాట్లాడినా కూడా తరువాత  ఎందుకనో వెనక్కు తగ్గారు. ఇప్పుడిక సాధారణ రిమాండ్ తరువాత ఆ దళిత హత్య ఏమౌతుందో అన్న సంశయం ఉంది.  వాస్తవానికి దళిత నేతలు ఎవ్వరూ కూడా అనంత బాబు విషయమై మాట్లాడలేదు. నిన్నటి వరకూ తానేటి వనిత (హోం మంత్రి) కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైగా టీడీపీ ఆరోపిస్తున్న విధంగా బొత్స లాంటి లీడర్లు మాత్రం అరెస్టును ప్రతిఘటించేందుకు ప్రయత్నించారని విమర్శలు ఉన్నాయి.

అరెస్టు లేకుండా చేసేందుకు కొన్ని రాజీ యత్నాలు బాధిత వర్గాలతో చేశారని కూడా అంటున్నారు. కానీ బాధిత వర్గాలు మాత్రం అస్సలు తగ్గలేదు అని కూడా తెలుస్తోంది. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి దక్కే సాయం ఏమయినా ఉందా అంటే అదీ లేదు అని మరో విమర్శ విపక్షం చేస్తోంది.