కేసీఆర్ ను సైతం ప్రభావితం చేసేటోళ్లు ఉన్నారండోయ్!

Thu Mar 21 2019 22:23:19 GMT+0530 (IST)

These Two Candidates Influence KCR

ఎవరిని దగ్గరకు తీయకపోవటం.. దగ్గరకు తీసుకున్న వారంతా కొద్ది కాలానికే పార్టీ నుంచి దూరం కావటమో.. లేదంటే నిప్పులు చెరగటమో టీఆర్ ఎస్ లో చూస్తుంటాం. గులాబీ బాస్ గా కేసీఆర్ తీరు విలక్షణంగా ఉంటుంది. ఎవరికి ఎక్కువ అవకాశం ఇవ్వని ఆయన్ను అంచనా కట్టటం అంత తేలిక కాదు. ఎవరైనా తన దారిలో నడవాల్సిందే కానీ.. ఆయన ఎవరి బాటలోకి నడటం కనిపించదు.అంతేకాదు.. కేసీఆర్ కు నచ్చితే నెత్తికి ఎక్కించుకుంటారు కానీ.. గారంతోనో.. మరోలానో కేసీఆర్ ముందు కోర్కెల చిట్టా పెట్టి తమకు అనుకూలంగా పనులు చేయించుకోవటం.. పదవులు ఇప్పించుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎక్కడిదాకానో ఎందుకు పార్టీ పెట్టిన నాటి నుంచి తన పక్కనే ఉంటూ.. తనకు నమ్మిన బంటుగా ఉన్న నాయిని నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సైతం ససేమిరా అనటమే కాదు.. నా అల్లుడికి ఇవ్వు బాబు అని పెద్దాయన మొత్తుకున్నా.. నో అంటే నో అనటమే కాదు.. కాస్తంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా ఏ మాత్రం చలించని తత్త్వం కేసీఆర్ సొంతం.

తాను కలవాలనుకుంటే కలవటం.. తాను ఇవ్వాలనుకుంటే అపాయింట్ మెంట్ ఇవ్వటమే తప్పించి..తనను కలవాలన్నా..  తనతో భేటీ కావాలనుకున్నా.. తనకు వినతిపత్రాలు ఇవ్వాలనుకున్న వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పాలి. సీఎంగా కానీ టీఆర్ ఎస్ అల్టిమేట్ బాస్ గా కానీ తానేం కోరుకున్నానో అది మాత్రమే జరగాలని బలంగా కోరుకునే తత్త్వం కేసీఆర్ సొంతం.

అలాంటి ఆయన్ను ప్రభావితం చేయటం మామూలోళ్ల వల్ల కాదు. కానీ.. ఎంతటి లోహమైనా ఏదో ఒక వేడి దగ్గర కరుగుతుందన్న సూత్రానికి తగ్గట్లే.. కేసీఆర్ ను ప్రభావితం చేసే ఇద్దరు నేతలు తాజాగా తెర మీదకు వచ్చారని చెప్పాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడుసార్లు వారు కేసీఆర్ నుప్రభావితం చేయగలిగారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. కేసీఆర్ ను అంతలా ప్రభావితం చేసిన ఆ ఇద్దరు టీఆర్ ఎస్ లో మొదట్నించి ఉన్న వారు కాదు. అంతేనా.. వారు పార్టీలోకి వచ్చే నాటికి టీఆర్ ఎస్ గుర్తు మీద గెలిచిన వారు కాదు. వేరే పార్టీలో ఉండి.. ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రంతో గులాబీ కారు ఎక్కిన ఆ ఇద్దరు ఈ రోజు గులాబీ బాస్ ను తాము కోరుకున్న పనులు చేయించుకోగలుగుతున్నారని చెప్పాలి.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు మంత్రి మల్లారెడ్డి కాగా.. మరొకరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ ఇద్దరి మూలాలు టీడీపీ కాగా.. తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచి టీఆర్ ఎస్ లో చేరటమే కాదు.. వారిప్పటివరకూ కోరుకున్న వాటిని కేసీఆర్  కాదనకుండా చేయించుకోవటం వారి ప్రత్యేకతగా చెప్పాలి. టీఆర్ ఎస్ లోకి చాలామంది నేతలు వచ్చారు. కానీ.. ఎవరి హవా కూడా వీరిద్దరి మాదిరి నడవటం లేదని చెప్పక తప్పదు.

2014లో మల్లారెడ్డి ఎంపీగా టీడపీ తరఫున పోటీ చేసి గెలవటం.. ఆ తర్వాత టీఆర్ ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలని.. మంత్రి పదవిని చేపట్టాలని ఉంది. తన ముచ్చటను కేసీఆర్ కు చెప్పటమే కాదు.. ఆయన మనసు దోచేసి.. ఆయన కోరుకున్నట్లే ఎంపీగా కాలపరిమితి పూర్తి కాక ముందే ఎమ్మెల్యే టికెట్ ను తెచ్చుకోగలిగారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రి పదవిని కూడా సొంతం చేసుకోగలిగారు. తాజాగా తన అల్లుడుకి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ ఎస్  టికెట్ ను తెచ్చుకోగలిగారు. మరిన్నిసార్లు కేసీఆర్ మనసును దోచుకోవటం మామూలు వారి వల్ల కాదని చెప్పాలి.

ఇక.. తలసాని విషయానికి వస్తే.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీఆర్ ఎస్ లోకి వస్తూనే నేరుగా మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ ఎస్ పార్టీలో ఇంత మంది చేరారు కానీ.. ఎవరూ కూడా పార్టీలోకి వస్తూనే మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసిన ఏకైక వ్యక్తిగా తలసానిని చెప్పుకోవాలి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు కానీ.. మంత్రి పదవిని నిలుపుకోవటం మాత్రం గొప్పే. దీనికి మించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తాజాగా తన కొడుకు సాయికిరణ్ కు సికింద్రాబాద్ టీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకోగలిగారు. మల్లారెడ్డి మాదిరే తలసాని కూడా కేసీఆర్ మనసును అదే పనిగా దోచుకోవటమే కాదు.. తాము కోరుకున్నవన్నీ అధినేత చేత చేయించుకున్నారని చెప్పాలి. ఎందుకు కేసీఆర్ జీ.. పార్టీ మొత్తంలో వీరిద్దరూ ఎందుకంత సో స్పెషల్..?