Begin typing your search above and press return to search.

కవితకు దక్కని ఊరట

By:  Tupaki Desk   |   27 March 2023 3:00 PM GMT
కవితకు దక్కని ఊరట
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ విషయంలో కల్వకుంట్ల కవిత కు సుప్రింకోర్టులో ఊరట దక్కలేదు. స్కామ్ లో కవితను ఇప్పటికే ఈడీ మూడుసార్లు విచారించిన విషయం తెలిసిందే. తనను ఈడీ విచారించకుండా, విచారించినా ఆఫీసులో విచారించేందుకు లేదని, తన పైన ఎలాంటి తీవ్రచర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని కోరుతు కవిత సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. దానిపైనే ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. అయితే కేసును మూడు వారాలపాటు కోర్టు వాయిదావేసింది.

విచారణలో కవిత కోరినట్లు ఈడీకి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవటం అంటే పిటీషనర్ కు ఎదురుదెబ్బగానే చూడాలి. ఇదే సమయంలో కవిత పిటీషన్ విషయంలో కోర్టు నిర్ణయాన్ని ప్రకటించేముందు తమ వాదనలు వినాలని ఈడీ దాఖలుచేసిన కేవియట్టే కీలకమైపోయింది. దాంతో కవిత కేసు కాస్త వీకైనట్లే నిపుణులు చెబుతున్నారు. పైగా కవిత తరపున వాదనలు వినిపించిన లాయర్ కపిల్ సిబల్ మాట్లాడుతు పిటీషనర్ నిందితురాలు కానపుడు ఈడీ విచారణకు పిలవాల్సిన అవసరం ఏమిటంటు పదేపదే వాదించారు.

అయితే సిబల్ మరచిపోయిన విషయం ఏమిటంటే పిటీషనర్ నిందితురాలా కాదా అన్నది విచారణలో మాత్రమే తేలుతుంది. ఇదే సమయంలో నిందితురాలు అయితే మాత్రమే విచారించాలా ? అనుమానితురాలిగా కూడా ఈడీ కవితను విచారించవచ్చు. ఇదే విషయాన్ని ఈడీ లాయర్ తన వాదనలో వినిపించారు. దాంతో రెండువైపుల వాదనలు విన్న కోర్టు కేసును మూడువారాలు వాయిదావేసింది.

ఇపుడు కవితకు సమస్య ఏమిటంటే మళ్ళీ ఈడీ గనుక విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే కచ్చితంగా హాజరుకావాల్సిందే తప్ప వేరేదారిలేదు. విచారణ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కోర్టు విచారణలో మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈడీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు కవిత వెళ్ళాల్సిందే. విచారణ సమయంలోనే ఈడీ కవితను అరెస్టుచేస్తే అదింకో మలుపు తిరుగుతుంది. అరెస్టు భయంతోనే కవిత ఈడీ విచారణ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా మరో మూడు వారాలపాటు కవితకు ఈడీ టెన్షన్ తప్పేట్లు లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.