Begin typing your search above and press return to search.

ఏపీలో డేటా అంతలా వాడేస్తున్నారట

By:  Tupaki Desk   |   30 Oct 2020 6:30 AM GMT
ఏపీలో డేటా అంతలా వాడేస్తున్నారట
X
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో డేటా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం.. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు.. ఇంట్లో నుంచే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కావటంతో పాటు.. కొత్తగా వచ్చిన సదుపాయాలు కూడా డేటా వినియోగాన్ని భారీగా పెంచేసినట్లుగా చెప్పక తప్పదు. గతంలో వారంలో ఒకలా.. వీకెండ్ లో మరోలా డేటా వినియోగం ఉంటే.. ఇప్పుడు ఎప్పుడూ ఒకేలాంటి డేటా వినియోగం మారటం గమనార్హం.

నెట్ స్పీడ్ ప్రాధాన్య అంశంగా మారటంతో.. బ్రాడ్ బ్యాండ్ల కనెక్షన్లకు గిరాకీ పెరిగినట్లుగా చెబుతున్నారు. బీఎస్ ఎన్ ఎల్ కనెక్షన్లు ఏడు నెలల్లో 15వేలు పెరిగితే.. బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే మరో ఫైబర్ నెట్ సంస్థ కరోనా తర్వాత ఏపీలో తన కనెక్షన్లను ఏకంగా 40వేలకు పెంచుకోవటం గమనార్హం.ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్ ఫైబర్ నెట్ కనెక్షన్లు 20వేలు ఉంటే.. కేవలం ఏడు నెలల కాలంలో అదనంగా పదిహేను వేల కనెక్షన్లు కొత్తగా తీసుకున్నారు.

డేటా వినియోగం ఎంత భారీగా పెరిగిందంటే.. ఫిబ్రవరి నాటికి ఏపీలో రోజుకు డేటా వినియోగం 1854 టెరా బైట్స్ గా ఉంటే.. గడిచిన ఆరు నెలల్లో (సెప్టెంబరు చివరి నాటికి) రోజుకు 5536 టెరాబైట్లకు పెరగటం గమనార్హం. గతంలో ఫైబర్ నెట్ వినియోగదారుల డేటా వినియోగం నెలకు సగటున 93 జీబీలు ఉంటే.. ప్రస్తుతం అది కాస్తా 164 జీబీలుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక్క బీఎస్ఎన్ ఎల్ లోనే మొబైల్ డేటా వినియోగంలో 25 శాతం మార్పు వస్తే.. మిగిలిన ప్రైవేటు డేటా వినియోగంలో భారీగా మార్పు ఉందని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే గణాంకాలు అదే విషయాన్ని చెబుతున్నాయి. జియో డేటా వినియోగం సగటున రోజుకు 6వేల టీబీలుగా ఉన్నట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ కు ముందు.. తర్వాత లెక్క చూస్తే.. 25శాతం మేర వినియోగం పెరిగిందట. మిగిలిన సర్వీసుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు.